పల్లె రుచులకు పట్టం 

24 Feb, 2018 12:56 IST|Sakshi
పిండి వంటలను తయారు చేస్తున్న దృశ్యం

సంప్రదాయ వంటకాలను అందిస్తున్న ‘శ్రీనిధి’   

మహిళల సారథ్యంలో ప్రగతి పథం  

వరంగల్‌ నుంచి విదేశాలకు ఎగుమతి 

30 మంది మహిళలకు ఉపాధి 

ఆదర్శంగా నిలుస్తున్న సంస్థ  

కాజీపేట అర్బన్‌: బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో లభించే పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌లపై మోజు పెంచుకుంటున్న నేటి కాలంలో సంప్రదాయ వంటలకు పట్టాభిషేకం చేస్తున్నారు ఓరుగల్లు వనితలు. కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు. వరంగల్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, ఇతర దేశాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నలుగురు మహిళలతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 30మంది ఉపాధి దుతున్నారు. దినదినాభివృద్ధి చెందతూ ప్రగతి పథంలో పయనిస్తున్న వరంగల్‌ హంటర్‌రోడ్డులోని ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ సంస్థపై ప్రత్యేక కథనం.. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వర్‌రావు, రాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రమ, ఉమ, ఉష, కుమారుడు భీంరావ్‌ ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో తల్లి చేసిన వంటలను ఆస్వాదించిన కుమార్తెలు నేటి తరానికి బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌కు దీటుగా సంప్రదాయ తెలంగాణ పిండి వంటకాలను పరిచయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు, మరదలు అర్చన(తమ్ముడి భార్య) కలిసి 2016 మే 2న ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ అనే సంస్థను ప్రారంభించారు. నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది ఉపాధి పొందుతున్నారు. 

వరంగల్‌ నుంచి విదేశాలకు... 
శ్రీనిధి సంస్థ ఉత్పత్తులను నగరంతోపాటు దేశవిదేశాల్లోని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. బెంగుళూరు, ముంబాయి, చెన్సై, నగరాలతోపాటు ఆస్టేలియా, అమెరికా వంటి దేశాలకు ఆర్డర్లపై పిండి వంటలను సరఫరా చేస్తున్నారు.  

ఆన్‌లైన్‌లో ఆర్డర్లు.. 
శ్రీనిధి తెలంగాణ పిండి వంటల కోసం ఆన్‌లైన్‌లో జస్ట్‌ డైల్‌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో శ్రీనిధి ఆర్డర్‌ కోసం 98494 03242, 93949 46666 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. 

రకరకాల రుచులు 
రుచిలో తేడా రాకుండా వంటలకు సంబంధించి కారం పొడి, పసుపు, ఇతర పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. పల్లి గారెలు, పçప్పు గారెలు, తెల్ల సకినాలు, కారం సకినాలు, చెగోడీలు, మురుకులు, బూందీ కార, మడుగులు, సర్వపిండి, అరిసెలు, బూందీ లడ్డూ, బాదుషా, గవ్వలు, పల్లి, నువ్వుల లడ్డూ, గరిజెలు, సున్నుండలతోపాటు, పచ్చళ్లను సైతం తయారు చేస్తున్నారు. పిండి వంటలు కిలోకు రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తున్నారు.  

ఆర్డర్‌ ఇస్తే చాలు.. 
వివాహాది శుభకార్యాల సందర్భంగా పిండి వంటలు కావాల్సిన వారు రెండు రోజుల ముందు ఆర్డర్‌ ఇస్తే చాలు సరఫరా చేస్తాం. తెలంగాణ పిండి వంటలకు నగరంలో మంచి డిమాండ్‌ ఉంటోంది. రుచికరమైన పిండి వంటలను అందించేందుకు స్వయంగా పప్పులు, కారం, పసుపును గిర్నీలో పట్టిస్తున్నాం. వంటల తయారీలో వంద శాతం, నాణ్యత, శుభ్రత 
పాటిస్తున్నాం.
- రమ, సంస్థ ప్రతినిధి 

చాలా ఆనందంగా ఉంది 
నేను నా పిల్లలు చేస్తున్న వంటలకు ఆదరణ లభిస్తుండడంతో ఆనందంగా ఉంది. మా వద్ద మరో 30 మంది గృహిణులు ఉపాధి పొందుతున్నారు. నేటి తరానికి సంప్రదాయ వంటకాలు తప్పనిసరిగా పరిచయం చేయాలి. తెలంగాణ పిండి వంటలు రుచితోపాటు బలాన్ని ఇస్తాయి. 
– రాధ, సంస్థ నిర్వాహకులు 

వనమాలకనపర్తి నుంచి వస్తా..  
ఐనవోలు మండలంలోని వనమాలకనపర్తి నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా. పిండి వంటలు తయారు చేసి ఉపాధి పొందడం బాగుంది. నిర్వాహకులు సొంత మనుషుల్లా చూసుకుంటారు. మేం చేసే వంటలకు గిరాకీ పెరుగుతోంది. 
– కళ, కార్మికురాలు 

సొంత ఇంట్లో ఉన్నట్లుగానే  
శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ప్రారంభించి నాటి నుంచి ఇక్కడ పని చేస్తున్నా. ఇంట్లో ఉండి పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది. నాకు పూర్వ అనుభవం ఏమీ లేకున్నా నిర్వాహకులు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం ఆనందంగా ఉంది. 
– దేవి, కార్మికురాలు. 

అమ్మ స్ఫూర్తితో.. 
అమ్మ స్ఫూర్తితో ప్రారంభించిన మా సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌లకు దీటుగా పిండి వంటలను పిల్లలకు అందించాలి. ప్రతిరోజు సుమారు 60 నుండి 100 మందికి పైగా కస్టమర్లు మా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో ఆర్డర్లపై పిండి వంటలను అందిస్తున్నాం. 
– ఉమ, సంస్థ ప్రతినిధి  

మరిన్ని వార్తలు