ట్రాలీల్లేక తిప్పలు!

23 May, 2019 08:17 IST|Sakshi

నిమ్స్‌లో రోగులకు ఇబ్బందులు  

అత్యవసర విభాగంలోనూ కరువు  

గంటల తరబడి అంబులెన్స్‌లోనే ఉండాల్సిన పరిస్థితి  

సోమాజిగూడ: చేవెళ్లకు చెందిన కిషన్‌ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందించిన అనంతరం కుటుంబసభ్యులు బుధవారం నిమ్స్‌కు తీసుకొచ్చారు. అయితే ట్రాలీలు లేని కారణంగా అతడు దాదాపు గంటన్నర అంబులెన్స్‌లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి వైద్యులకు ఎంత మొరపెట్టుకున్నా ‘ట్రాలీలు ఖాళీ అయ్యే వరకు ఉండండి. లేని పక్షంలో వెళ్లిపోండంటూ’ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. ఇటాంటి సంఘటనలు నిమ్స్‌ అత్యవసర విభాగం వద్ద నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడనే కాదు నిమ్స్‌లో నిత్యం ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. నిన్నటి వరకు నీటి కొరతతో సర్జరీలు నిలిపివేసిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ట్రాలీలు సరిపడా లేక రోగికి నిమ్స్‌ అత్యవసర సర్వీసు విభాగంలో అడ్మిషన్‌ దొరకడం లేదు. గతరెండు రోజులుగా నిమ్స్‌ అత్యవసర విభాగానికి రోగుల తాకిడి పెరిగింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్సకు వచ్చిన రోగులు గంటల తరబడి వారు వచ్చిన వాహనంలోనే ఉండాల్సి వస్తోంది. సకాలంలో రోగికి వైద్యం అందకపోవడంతో బంధువులు వైద్యులతో ఘర్షణకు దిగుతున్నారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన నిమ్స్‌ ఆసుపత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి కారణం ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తోంది. 

30 ట్రాలీలు ఫుల్‌...   
ఎవరైనా ఆత్మహత్మలకు పాల్పడినా, ప్రమాదానికి గురైనా మరేదైనా సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించి నిమ్స్‌కు తీసుకొస్తారు. అలా వచ్చిన వారంతా అత్యవసర విభాగంలో అడ్మిషన్‌ పొందుతారు. అడ్మిషన్‌ పొందిన రోగి సుమారు 10 రోజులు ట్రాలీపైనే ఉంటున్నాడు. ముందుగా అడ్మిషన్‌ పొందిన రోగి డిశ్చార్జ్‌ కాకపోవడంతో ఈ సమస్య తెలెత్తుతోంది. అత్యవసర విభాగానికి వచ్చిన రోగిని ట్రాలీలపై లోపలకు తీసుకెళ్తారు. సంబంధిత రోగిని ట్రాలీపైనే ఉంచి వైద్యం అందిస్తారు. అప్పటికే అక్కడ బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి డిశ్చార్జ్‌ అయితేనే ట్రాలీ నుంచి బెడ్డుకు మార్చుతారు. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రోగులు ఎక్కువ రోజులు చికిత్స పొందడం, ఉన్న బెడ్స్, ట్రాలీలు ఖాళీ కాకపోవడంతో కొత్తగా వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. అయితే మంగళవారం అత్యవసర సర్వీసు విభాగానికి వివిధ కారణాలతో సుమారు 50 మంది రోగులు వచ్చారు. దాంతో అక్కడనున్న ట్రాలీలు సరిపోకపోవడంతో మరో 20 ట్రాలీలను ఓపీ నుంచి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు