కలిసొచ్చిన వీధిపోటు !

13 Nov, 2018 09:23 IST|Sakshi

తూర్పు వీధిపోటుతోనే చిన్నారెడ్డి రెండు గృహాలు 

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు, రెండేళ్లు మంత్రి పదవి 

33 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర

సాక్షి, వనపర్తి : ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.చిన్నారెడ్డికి తూర్పు వీధిపోటు కలిసొస్తోంది. 1985లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన ఇప్పటి వరకు నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండేళ్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

  వనపర్తి నియోజకవర్గం నుంచి గడిచిన ఆరు దశాబ్దాల్లో మంత్రిగా పని చేసిన ఏకైక వ్యక్తిగా చిన్నారెడ్డికి గుర్తింపు ఉంది. ప్రత్యక్ష ఎన్నికలకు రాకమునుపు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలుపొందారు.

వాస్తుపై నమ్మకం 
మొదటి నుంచి చిన్నారెడ్డికి వాస్తుపై నమ్మకం ఎక్కువే. స్వగ్రామమైన గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపురంలోని చిన్నారెడ్డి ఇంటికి తూర్పు వీధిపోటుతో ఉంటుంది. గత 25 ఏళ్ల క్రితం వనపర్తి పట్టణంలో ఇంటిని సైతం తూర్పు వీధిపోటు వచ్చేలా నిర్మించుకున్నారు. సూర్యనారాయణుడు ఉదయించిన వెంటనే తమ ఇంటిలోకి కిరణాలు రావాలని.. తద్వారా ఆ ఇల్లూ.. ఇంట్లోని వారు ప్రకాశిస్తారని ఆయన నమ్మకం.

అందుకే గడిచిన ఏడు పర్యాయాలు ఎన్నికల ప్రచారం, ఇతరత్రా పనులను ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. కాగా, చిన్నారెడ్డి 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సో నియాగాంధీ పిలిచి మరీ ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేయగా.. 2014లో రాష్ట్రంలో ఎక్కువగా టీఆర్‌ఎస్‌ హవా ఉన్నా.. వనపర్తిలో మాత్రం చిన్నారెడ్డి గెలుపొందారు. 

మరిన్ని వార్తలు