తెలంగాణలో బలపడదాం

21 Oct, 2014 00:46 IST|Sakshi
తెలంగాణలో బలపడదాం

వైఎస్సార్‌సీపీ నిర్ణయం  ముగిసిన సమీక్షా సమావేశాలుట
 
హైదరాబాద్: రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ దృష్టి సారించింది. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, పరిస్థితులపై చర్చించేందుకు, జిల్లా నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఉద్దేశించిన 9 జిల్లాల (ఖమ్మం మినహా) పార్టీ సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలకు సంబంధించిన సమీక్షలు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. పార్టీపరంగా నిర్వహించిన ఈ సమీక్షలో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? పటిష్టం చేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలి? క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఏమిటి అన్న దానిపై ప్రధానంగా సమాలోచనలు చేశారు. తెలంగాణ జిల్లాల్లో దివంగత నేత డా.వైఎస్సార్ పట్ల అభిమానం, ఆదరణ.. ఇప్పటికీ ఆయనను బడుగు, బలహీనవర్గాల ప్రజలు గుర్తుకు చేసుకోవడం వంటి అంశాల ను అన్నిజిల్లాల నాయకులు ప్రస్తావించడం పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చింది.

 25న పార్టీ కార్యాచరణపై చర్చిస్తాం: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

‘జిల్లాల సమీక్షల సందర్భంగా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకులు వివరించారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో పేదలు పడుతున్న ఇబ్బందులు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయి. దివంగత సీఎం డా.వైఎస్సార్ అమలుచేసిన పథకాలు, పెన్షన్లు, కార్డులు, ఇతర ప్రయోజనాలను అందించిన తీరును అధికసంఖ్యలో ప్రజలు ప్రస్తావించారని జిల్లా నాయకులు సమీక్షల్లో తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును గురించి, వైఎస్ హయాంలో సాగిన సంక్షేమం గురించి ప్రజల్లో చర్చ నడుస్తోందని వివరించారు. సీఎం కేసీఆర్ ఏదో చేస్తారని ఆశిస్తే ఇంకేదో చేస్తున్నారనే విమర్శలు కూడా ప్రజల నుంచి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. విద్యుత్ సమస్య, ఇతర సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తే బావుంటుందనే సూచనలు వచ్చాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి దాటవేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజా సమస్యలపై ఆందోళనలు, కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ నెల 25న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కన్వీనర్లు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులు సమావేశమై జిల్లా సమీక్షల్లో వెల్లడైన అభిప్రాయాలు, ఆయా అంశాలకు సంబంధించి వచ్చిన సూచనలు, సలహాలపై చర్చిస్తాం. ఈ విషయాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాలకు అనుగుణంగా పార్టీపరంగా చేపట్టబోయే కార్యాచరణను నిర్ణయిస్తాం’    
 
 

మరిన్ని వార్తలు