గడపగడపకూ వైఎస్సార్‌సీపీ.

20 Apr, 2015 04:03 IST|Sakshi

- జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ
- త్వరలో మండల కమిటీల ఏర్పాటు
- ఈ నెల 25న జిల్లా కార్యవర్గం ఎన్నిక
- నిజామాబాద్‌లో జిల్లాస్థాయి సమావేశం
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి
నిజామాబాద్ అర్భన్ :
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల  సిద్ధార్థరెడ్డి తెలిపారు. త్వరలోనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ముందుగా ఈనెల 25న నిజామాబాద్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పేద, బడుగు, బలహీన, గిరిజన ప్రజల తరఫున అనేక ఉద్యమాలు నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైందని, ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ నినాదంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని గడపగడపకూ వైఎస్సార్‌సీపీతెలిపారు. అధిష్టానం నిర్ణయాల మేరకు జిల్లాలో కిందిస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టడం ద్వారా మరింత బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నామన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని పార్టీ పటిష్టతకు అన్ని స్థాయిల్లోనూ ఉపయోగించుకుంటామని అన్నారు. అకాలవర్షం, వడగండ్ల కారణంగా నష్టపోయిన రైతులను కలిసి తమ పార్టీ తరపున భరోసా ఇచ్చామన్నారు. నష్టాల ఊబిలో ఉన్న రైతులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఆయన పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, ఆ తర్వాత రైతులను పట్టించుకునేవారే లేకుం డా పోయారని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయిందని, నష్టపరిహారం, పంట అంచనాలో ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25న నిజామాబాద్‌లో నిర్వహించే సమావేశానికి వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించామని చెప్పారు.

మరిన్ని వార్తలు