బలపడిన ద్వైపాక్షిక బంధం

9 Oct, 2014 00:46 IST|Sakshi
బలపడిన ద్వైపాక్షిక బంధం
  • పలు నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చలు
  •  ప్రజారవాణా, గృహనిర్మాణం, స్మార్ట్ సిటీస్‌పై చర్చ
  •  పరస్పర సహకారానికి అంగీకారం
  •  వివరాలు వెల్లడించిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న
  • సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన ప్రజారవాణా, గృహ నిర్మాణం, స్మార్ట్‌సిటీల నిర్మాణం తదితర అంశాల్లో పలు నగరాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. హెచ్‌ఐసీసీలో మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం పలు నగరాల మేయర్లతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న విలేకరులకు వెల్లడించారు. ఆయా నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చించిన వివరాలు ఇలా..
     
    మెట్రోపొలిస్ మేయర్ జీన్‌పాల్‌హచాన్‌తో..

    తీరైన పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెట్రొపోలిస్ సదస్సులో ఆయా అంశాలపై జరిగిన చర్చలను వేర్వేరుగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను జీన్‌పాల్ హచాన్ ప్యారీస్‌కు ఆహ్వానించారు. త్వరలో వాతావరణ మార్పులపై ప్యారీస్‌లో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని కోరారు.
     
    బెర్లిన్ డిప్యూటీ మేయర్ బర్భరా బెర్నింగర్‌తో..

    స్మార్ట్‌సిటీల నిర్మాణం,పేదలకు తక్కువ ఖర్చుతో నిర్మించనున్న గృహాలు, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో బెర్లిన్ నగరం నుంచి సాంకేతిక సహకారం అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మన్ కంపెనీలు గ్రేటర్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఐటీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరగనున్న మెట్రోపాలిటన్ సొల్యూషన్స్ సదస్సులో పాల్గొనాలని ఆమె కేటీఆర్‌ను ఆహ్వానించారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె హామీ ఇచ్చారు.
     
    మాషాద్ మేయర్ సోలాట్ మోర్తాజావితో..

    సంస్కృతి, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంతోపాటు పట్టణాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. ఇరాన్, హైదరాబాద్ నగరాలకు మధ్యనున్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మషాద్ నగరం ఏటా 24 మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇరాన్‌కు తమ నగరం ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్‌కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పలు ఐటీ కంపెనీలు మషాద్ నగరంలోనూ తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఆయనకు తెలిపారు.
     
    జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టవ్‌తో..

    నగరాల్లో సురక్షిత భద్రతా ఏర్పాట్లు చేసే అంశంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. విశ్వవిద్యాలయాల సౌజన్యంతో సైన్స్‌పార్క్‌ల ఏర్పాటుపై అభిప్రాయాలను పంచుకున్నారు. జోహెన్స్‌బర్గ్ నవనిర్మాణానికి అక్కడ చేపట్టిన సంస్కరణలు, సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను వివరించారు. జోహెన్స్‌బర్గ్ సహకారంతో హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. జోహెన్స్‌బర్గ్ నగరానికి ఐటీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హరిత భవనాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఐటీ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
     
    సావోపోలో మేయర్ రోవేనాతో..

    దక్షిణ అమెరికాలోని సాపోలో నగరంలో 11 మిలియన్ల మంది నివసిస్తున్నారని రోవేనా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణరంగం,పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, ఆరోగ్యం, గృహనిర్మాణం, వ్యాక్సీన్ల అభివృద్ధి విషయంలో పర స్పరం సహకరించుకోవాలనే ఆలోచనకు వచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో గృహనిర్మాణం, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, సావోపోలో నగరాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు.
     
    బార్సిలోనా మేయర్ క్సేవియర్ ట్రయాస్‌తో..

    స్మార్ట్‌సిటీల నిర్మాణం, ఇంధన భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, స్థలాలు, మేనేజ్‌మెంట్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పలు అంశాల్లో బార్సిలోనా సాధించిన విజయాలను ఆయన కేటీఆర్‌కు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
     

మరిన్ని వార్తలు