బ్యాంకింగ్‌ అక్రమాలపై కఠిన చర్యలు

21 Feb, 2018 02:26 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వెలుగు చూసిన బ్యాంకింగ్‌ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కేసులో బ్యాంకు సిబ్బంది కూడా కుమ్మక్కైనట్లుందని ఆయన ఆరోపించారు.

బ్యాంకుకు రూ.3,695 కోట్లు ఎగ్గొట్టిన రొటోమ్యాక్‌ కంపెనీ ప్రమోటర్‌ విక్రమ్‌ కొఠారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు రూ.లక్ష రుణం కావాలంటే అనేక కొర్రీలు పెట్టే బ్యాంకులు వ్యాపారులకు వేల కోట్ల అప్పు ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వీటిపై విచారణ జరిపించాలని లేకపోతే బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు