మూణ్నాళ్ల ముచ్చటేనా..! 

6 Jun, 2018 09:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌) : ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించాలని పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లఘుచిత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా హెల్మెట్‌ పెట్టుకుంటే బరువని, హేర్‌స్టైల్‌ చెదిరిపోతుందని భావిస్తూ చాలామంది దానిని ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పో తున్నారు. కుటుంబాలకు దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. గతంలో హెల్మెట్‌ వినియోగం చాలా వరకు అమలు జరిగినా పోలీసులు, రవాణాశాఖ అధికారులు రానురాను కొంత పట్టించుకోకపోవడంతో అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. 

ప్రత్యేక డ్రైవ్‌తో... 
గతంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు సం యుక్తంగా హెల్మెట్‌ వినియోగాన్ని అమలు చేశా రు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్‌ ధరించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్‌స్టేషన్‌లకు వస్తే హెల్మెట్‌ లేకుండా రావద్దని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొంత హెల్మెట్‌ వినియోగంలో వాహన చోదకులు బాధ్యతగా తీసుకున్నారు. హెల్మెట్‌ను విధిగా ఉపయోగించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హెల్మెట్‌ వినియోగం చాలా వరకు తగ్గిపోగా పోలీ సులు సైతం నామమాత్రంగా తీసుకుంటున్నారు.  

భారీ ఎత్తున జరిమానాలు... 
హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో నూతన రవాణ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టు పడితే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించే వారు. ఇక ఇప్పుడు భారీగా జరిమానా విధించైనా సరే హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నో హెల్మెట్‌–నో పెట్రోల్‌ నినాదం అమలు జరిపేలా చర్యలు తీసుకొనే విధంగా పోలీసులు చూస్తున్నారు. ఇక రవాణ శాఖాధికారులకు హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే ఆ శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1వెయ్యితో పాటు హెల్మెట్‌ లేని కారణంగా మరో రూ. 100 మొత్తం కలిపి రూ.1,100 జరిమానా విధిస్తారు. అయితే ఇటీవల హెల్మెట్‌ వినియోగం తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ క్రమంలో వాహన చోదకులు హెల్మెట్‌ రోజూవారీగా ధరించేలా చూస్తామని రవాణ శాఖ సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గడ్డం వివేకానంద్‌రెడ్డి అన్నారు.  

ప్రాణాలు కోల్పోతున్నా... 
రహదారి ప్రమాదాల్లో 70శాతం మంది ద్విచక్రవాహనదారులు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తూ మృత్యువాత పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కిందపడి తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. 2016లో 222 ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగగా 160 మంది మృతి చెందారు. మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. 2017లో జరిగిన 236 ద్విచక్ర వాహనప్రమాదాల్లో 196 మంది మృతి చెందగా 145 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2018 మే నెల వరకు 95 ప్రమాదాలు జరగగా 80 మంది వరకు మృత్యువాత పడగా 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. 

కఠినంగా వ్యవహరిస్తాం... 
హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానా తక్కువగా ఉండటం, తనిఖీల సమయాల్లో వాహనదారులు అప్రమత్తం కావడం వలన హెల్మెట్‌ వినియోగంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రవాణ చట్టాలను కఠినంగా అమలు చేసి హెల్మెట్‌ వినియోగం తప్పనిసరి చేస్తాం. అవసరమైతే రవాణాశాఖా అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్‌ వినియోగం పెంచడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. 
–జి.సతీశ్, ట్రాఫిక్‌ సీఐ, మంచిర్యాల 

>
మరిన్ని వార్తలు