‘గ్రేటర్’లో సమ్మె దుమారం

23 Apr, 2014 01:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్మికులు సోమవారం నుంచి చేపట్టిన సమ్మె తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. అధికారులు.. ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన తరుణంలో కమిషనర్ చెత్త తరలింపు పనులను రాంకీకి కట్టబెట్టడాన్ని జీహెచ్‌ఎంఈయూ తప్పు పడుతుండగా.. ఎన్నికల సమయాన్ని ఆసరా చేసుకొని యూనియన్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక ల్లేకుండా చెత్త తరలింపు రవాణాను స్తంభింపచేయడాన్ని కమిషనర్ సోమేశ్‌కుమార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికల సమయంలో సమ్మెకు దిగిన యూనియన్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బుధవారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకావాలని సూచించారు.
 
లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్మాను ప్రయోగించడమే కాక ఆర్‌పీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంఈయూ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా లేబర్ కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, తమ డిమాండ్లు సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను ఉపసంహరించేది లేదని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లోని వారి విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా కేవలం రవాణా విభాగంలోని వారు మాత్రం ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటుండగా.. 30వ తేదీన పోలింగ్ అనంతరం జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.
 
 ఎక్కడి చెత్త అక్కడే...
 సోమవారం నుంచి సమ్మెలో ఉన్న కార్మికులు చెత్త తరలింపు పనులు చేయకపోవడంతో గ్రేటర్‌లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిస్థితులు తీవ్ర దుర్భరంగా మారాయి. యూనియన్ ఈ సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ప్రైవేటుకిచ్చేందుకు ఇప్పుడు కొత్తగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సమ్మె కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వార్డుకు ఒక్కో వాహనాన్ని అద్దెకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరిస్థితుల దృష్ట్యా కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలన్నారు. వారితో సంప్రదించాల్సిందిగా స్పెషల్ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సీనియర్ అధికారులకు సూచించామన్నారు.

మరిన్ని వార్తలు