విద్యార్థిని కంటిలో పెన్సిల్‌ ముక్క

28 Mar, 2019 06:51 IST|Sakshi
సుప్రియ (ఫైల్‌)

తోటి విద్యార్థి దాడితో తీవ్ర గాయం

తొలగించిన వైద్యులు

చికిత్స పొందుతున్న బాలిక

రాజేంద్రనగర్‌: తోటి విద్యార్థి దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. పెన్సిల్‌ ముక్క కంటిలోపలికి వెళ్లడంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు. అయితే ఆ విద్యార్థి కంటిచూపు కోల్పోయే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో బాధిత కూతురు తల్లి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్, సుహాసిని దంపతుల కూతురు సుప్రియ (7). ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృషి హైస్కూల్‌లో పాప నాల్గో తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం ‘‘మీ పాపకు గాయమైంది వచ్చి తీసుకెళ్లండి’ అని పాఠశాల నుంచి ఫోన్‌ వచ్చింది. వెంటనే పాఠశాలకు వెళ్లగా సుప్రియ ఏడుస్తూ కూర్చుంది.

కంటికి ఉన్న చేతిరుమాలు తీసి చూడగా తీవ్రంగా గాయమైంది. తన తోటి విద్యార్థి పెన్సిల్‌తో కంటిలో పొడిచాడని తల్లికి పాప చెప్పింది. వెంటనే ఆమె హైదరాబాద్‌లోని ఎల్‌.వీ.ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్య సేవలు ఆలస్యమవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీయగా కంటి లోపల పెన్సిల్‌ ముక్కను గుర్తించారు. వెంటనే వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆ పెన్సిల్‌ ముక్క తీసేశారు. అయినా కంటి లోపల రక్తం పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్‌ అయ్యిందని, చూపుపోయే స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి బోరున విలపించింది. ఈ విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌తో పాటు నిర్వాహకులు ప్రకాశ్‌రావు, భాస్కర్, టీచర్‌ జమునను ప్రశ్నిస్తే తమకేమి తెలియదని బదులిచ్చారు. సుప్రియనే కళ్లల్లో పెన్సిల్‌తో గాయం చేసుకుందని చెప్పారని తెలిపారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను చూపించాలని కోరినా తనపై దౌర్జన్యం చేశారని బాధిత తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరుతోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు