భవనంపై నుంచి జారి పడిన విద్యార్థిని

5 Nov, 2017 02:21 IST|Sakshi

తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం

పాల్మాకుల కస్తూర్బా పాఠశాలలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): కస్తూర్బా విద్యాలయంలోని ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో రెండంతస్తుల భవనంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైంది. మండల పరిధిలోని పాల్మాకులలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భవనంపై ఆరేసిన దుస్తులు తీయడానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడినట్లు టీచర్లు చెబుతుండగా.. సరిగా చదువుకోలేదని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని భవనంపై నుంచి దూకినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

వివరాలు.. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన బెల్లంకొండ మల్లేశ్, సునీత దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. వీరు చాదర్‌గుట్ట సమీపంలో బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు రేణుక పాల్మాకుల కస్తూర్బా పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది. ఇటీవలే ఆమె త్రైమాసిక పరీక్షలు రాసింది. రేణుక గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కాగా.. తరగతిలోని విద్యార్థులను గ్రూపులుగా విభజించి విద్యాభ్యాసం చేయిస్తున్నారు.

ఈ క్రమంలో గ్రూపు లీడర్‌ చెప్పింది రేణుక వినకపోవడంతో ఉపాధ్యాయులు మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2న సాయంత్రం పాఠశాల ముగియగానే రేణుక భవనం రెండో అంతస్తు పైకి వెళ్లింది. అక్కడ దుస్తులు తీస్తుండగా.. జారి కింద పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కాలు, నడుముకు గాయాలయ్యాయి. ఆమెను శంషాబాద్‌లోని  ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు.

కాలు విరగడంతో ఆపరేషన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం అవసరమైన డబ్బులను పాఠశాల ఉపాధ్యాయులు సర్దినట్లు విద్యార్థిని తల్లి సునీత తెలిపారు. భవనంపై నుంచి జారిపడిందని ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా దాచారు.

ప్రమాదవశాత్తు జరిగింది: ప్రిన్సిపాల్‌
భవనంపై నుంచి విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడిందని ప్రిన్సిపాల్‌ మాధవి తెలిపారు. ఇటీవల పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో కష్టపడి చదవాలని సూచించామని, దీంతో అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు