స్టూడెంట్‌... పోలీస్‌ క్యాడెట్‌

25 Feb, 2020 11:35 IST|Sakshi
కార్యక్రమానికి హాజరైన పోలీస్‌ క్యాడెట్‌లు

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజెప్పడం, అవసరమైనప్పుడు వలంటీర్లుగా సేవలందించడం కోసం సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు ‘స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌’లుగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు, అవార్డులు అందచేసే కార్యక్రమాన్ని సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. సినీ హీరో రానా, ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగావీరు స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

గచ్చిబౌలి: ‘నేను ఎంతో కష్టపడి చదువుకుని ఈ స్థాయికి ఎదిగాను. ఒకప్పుడు ఒక్కరూపాయి పాకెట్‌ ఇచ్చేందుకు మా అమ్మ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు రూ.60 కోట్ల రూపాయల చెక్కులపై సంతకం చేసే స్థాయికి చేరుకున్నా. మీరు కూడా కష్టపడి చదువుకుని ఉన్నతస్థానాలు అధిరోహించాలి’ అని అడిషనల్‌ డీజీ, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో ఎస్‌పీసీ(స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌) వార్షిక ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యతిథిగా విచ్చేసి మాట్లాడారు. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఉన్న మీరు పదేళ్ల తరువాత ఈ స్టేజిపై అతిథులుగా వస్తారని ఆయన పేర్కొన్నారు. సమాజం, పోలీస్‌ స్టేషన్లకు మధ్య రాయబారులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. యూనివర్సిటీలలో లేని పుస్తకాలను మీ చేత పోలీసులు చదివిస్తున్నారని అన్నారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి, ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలోనే శ్రమించాలని సూచించారు.

సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ కేరళ మారిదిగా స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌లకు 2017 నుంచి శిక్షణ ఇస్తున్నామన్నారు. 30 జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన 2552 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మంచి పౌరులుగా ఎదిగి సమాజాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి పుస్తకాలు చదవాలని కోరారు. చట్టాన్ని గౌరవించడం, ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించడమే కాకుండా ఇతరులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంతకు ముందు క్యాడెట్‌లతో హీరో దగ్గుబాటి రానా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌లో ట్రిపుల్‌ ఐటీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. సర్టిఫికెట్‌లతో పాటు క్విజ్, లాంగ్‌ జంప్, రన్నింగ్‌లో ప్రతిభ కనబరిచిన ఎస్‌పీసీలకు మెడల్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీసీ విజయ్‌ కుమార్, మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌ రావు, ఏడీసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు