‘ఆపరేషన్‌ ఎన్‌ఎస్‌యూఐ’

4 Jan, 2019 04:44 IST|Sakshi

కొత్త ఓటర్లను ఆకర్షించేందుకువిద్యార్థి విభాగం పటిష్టం

టీపీసీసీ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ మార్గదర్శనం

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆపరేషన్‌ ఎన్‌ఎస్‌యూఐ’పేరుతో రాబోయే ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లను ఆకర్షించే కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టనుంది. పార్టీకి అనుబం«ధంగా ఉన్న భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు యువతను ఆకర్షించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఓటర్లకు దగ్గరయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త ఓటర్లను పార్టీవైపు తిప్పుకోవాలని, అందులో భాగంగా రాష్ట్రంలో కూడా పకడ్బందీ ప్రణాళిక తో ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన సూచనల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే కార్యాచరణ రూపొందించనున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాతో గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 

నేరుగా సంబంధాలు జరపండి
విద్యార్థులను పార్టీ వైపు ఆకర్షించేందుకు పార్టీ నేతలే నేరుగా వారితో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని రాహుల్‌ గాంధీ పార్టీకి సూచించినట్లు ఉత్తమ్, కుంతియాలు వెల్లడించారు. ఎన్‌ఎస్‌యూఐని మరింత విస్తృతం చేసి విద్యాసంస్థల్లో చేరే సమయంలో విద్యార్థులకు అండగా ఉండటం, ఉద్యోగాల నియామకాలు, ఆ ప్రక్రియలో అవకతవకలు లేకుండా చేసేందుకు పోరాటాలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 25% యువతకు అవకాశం కల్పించడం, బ్లాక్‌స్థాయిలో యూత్‌క్లబ్‌లను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలని తెలిపారు. విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, బెటర్‌ ఇండియా (బెహతర్‌ భారత్‌) నిర్మాణానికి పిలుపునిచ్చి అందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

వెయ్యిమందికి పైగా విద్యార్థులున్న కళాశాలలను ఎంపిక చేసుకుని వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విద్యా సంబంధ అంశాలపై కరపత్రాలు పంపిణీ చేయించాలని, రన్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా, బెటర్‌ ఇండియా ఫెస్టివల్స్‌ లాంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ విద్యార్థి, యువత ను చైతన్యపరిచేలా షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొం దిం చాలని సూచించారు. రాహుల్‌ సూచనల మేరకు త్వరలోనే ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ రాష్ట్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు