తాకట్టులో విద్యార్హత!

7 Jun, 2017 01:53 IST|Sakshi
తాకట్టులో విద్యార్హత!

ఫీజులు చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే..
మూడేళ్లు దాటినా బకాయిల ఊసెత్తని సర్కారు
ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటున్న కాలేజీలు
చెల్లించలేక కాలేజీల్లోనే వదిలేసిన విద్యార్థులు


ఉప్పల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి.. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో 2013–14లో ఎంటెక్‌ పూర్తి చేశాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు బకాయిలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కాలేజీ యాజమాన్యానికి అతని ఫీజు అందలేదు. దీంతో టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్‌ సర్టిఫికెట్లను ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం తమ వద్దే ఉంచుకుంది. సర్టిఫికెట్లు అవసరమైతే బకాయిలకు సంబంధించి మొత్తాన్ని డీడీS రూపంలో ఇచ్చి తీసుకెళ్లవచ్చని, సర్టిఫికెట్లు వెనక్కు ఇస్తే డీడీ ఇస్తామని వెసులుబాటు కల్పించింది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వూ్యలు తదితర సందర్భాల్లో వెంకట్‌రెడ్డి అప్పు చేసి కాలేజీలో డీడీలు సమర్పించి సర్టిఫికెట్లు పొందడం.. తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తెచ్చుకోవడం చేస్తున్నాడు.    

రాష్ట్ర విభజన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన పథకాలపై నెలకొన్న అయోమయం ఇప్పటికీ తీరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిధుల కేటాయింపులు, విడుదల సక్రమంగా ఉన్నప్పటికీ.. విభజన సమయం లో నెలకొన్న బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడం లేదు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నా రు. 2013–14 విద్యా సంవత్సరంలో దాదాపు 1.18 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.248.05 కోట్ల మేర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు.

సాధారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించిన చెల్లింపులను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతి ఏడాదిలో విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఆ ప్రకారం 2013–14కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, ఉపకార వేతనాలు 2014–15లో ఇవ్వాలి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు విభాగాల విభజన ఆలస్యం కావడంతో ఆ ఏడాది నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలో వార్షిక సంవత్సరం చివర్లో బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికీ పూర్తిస్థాయి నిధులు విడుదల కాలేదు.

ఖజానా విభాగం వద్దే పలు బిల్లులు
2013–14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం తెలంగాణ జిల్లాల నుంచి 14.31 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతను నిర్ధారించిన అధికారులు రూ. 2,296.20 కోట్లు అవసరమని లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో 2014–15 వార్షిక సంవత్సరం చివర్లో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌ మెంట్, ఉపకార వేతన బిల్లులను సంక్షేమ అధికారులు పాస్‌ చేశారు. ఆయితే వీటిలో పలు బిల్లులు ఖజానా విభాగంలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు నిధులు విడుదల కాకుండా బ్రేక్‌ పడింది. ఇలా మొత్తంగా రూ. 248.05 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినప్పటికీ స్పందన మాత్రం శూన్యం. దీంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ధ్రువపత్రాలన్నీ కాలేజీల్లోనే..
రీయింబర్స్‌మెంట్‌ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక సంబంధిత విద్యార్థుల ధ్రువపత్రాలు కాలేజీల్లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు తక్కువ మొత్తంలో ఫీజులుండటంతో చెల్లింపులు జరిపి సర్టిఫికెట్లు తీసుకోగలిగారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు మాత్రం పెద్ద మొత్తంలో ఫీజులు బకాయి పడటంతో చాలామంది తమ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాల వద్దే వదిలేశారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తు సమయంలో కాలేజీల్లో బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని డీడీ రూపంలో సమర్పించి వాటిని తాత్కాలిక పద్ధతిలో తెచ్చుకోవడం, తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు డీడీ చార్జీల భారం మించిపోతోంది. ఇందులోనూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి ఫీజులను నిర్ధారించాయి.

రెండుసార్లు డీడీలు ఇచ్చా..
‘పీహెచ్‌డీ కౌన్సెలింగ్, అడ్మిషన్‌ సమయంలో రెండుసార్లు ఎంటెక్‌ సర్టిఫికెట్లు అవసరమైతే రూ.20 వేల మేరకు డీడీలు తీసి కాలేజీలో సమర్పించా. ప్రక్రియ ముగిశాక తిరిగి డీడీలను తీసుకున్నా’ అని ఓయూలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని సుష్మ ‘సాక్షి’తో అన్నారు.

మరిన్ని వార్తలు