ఆక్సిజన్‌ సిలిండర్‌తో పరీక్షకు..

17 Mar, 2019 02:51 IST|Sakshi
ఆటోలో రాగన్నగూడలోని పరీక్ష కేంద్రానికి వెళుతున్న విద్యార్థిని నవీన

మూడు నెలలుగా ఆస్తమాతో బాధపడుతున్న విద్యార్థిని నవీన

తుర్కయంజాల్‌: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు.

ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్‌ సిలిండర్‌ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్‌ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది.

మరిన్ని వార్తలు