వాట్సాప్‌లో హోంవర్క్‌

6 Jul, 2020 08:24 IST|Sakshi

బడులు బంద్‌ ఉన్నా పాఠాలు మరచిపోవద్దని.. 

సామాజిక మాద్యమాల ద్వారా హోం వర్క్‌

ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సయ్య కృషి 

మోర్తాడ్‌(బాల్కొండ): కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం ఇంకా తేదీని ఖరారు చేయలేదు. నెలల తరబడి పాఠశాలలు బంద్‌ ఉండడంతో గతంలో నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు మరిచిపోకుండా ఉండడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు వినూత్న పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్‌ను వేదికగా చేసుకుని తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రోజూ హోంవర్క్‌ ఇచ్చి వారికి పాఠాలు జ్ఞాపకం ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. ఆయనే బాల్కొండ మండలం బస్సాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బోయిడ నర్సయ్య.

తమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉండగా వారి తల్లితండ్రుల వాట్సాప్‌ నంబర్లను సేకరించారు. వాట్సాప్‌ నంబర్లతో తరగతుల వారీగా గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రోజూ హోం వర్క్‌ను ఇస్తున్నారు. సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లిష్‌ బుధవారం గణితం, గురువారం సైన్స్, శుక్రవారం సాంఘిక శాస్త్రం, శనివారం డ్రాయింగ్‌ హోంవర్క్‌లను విద్యార్థులకు ఇస్తున్నారు. వాట్సాప్‌లలో హోంవర్క్‌ ఇచ్చిన తరువాత మరుసటి రోజున ఆ హోంవర్క్‌ కాపీలను మళ్లీ వాట్సాప్‌ గ్రూపులలో పోస్టు చేయిస్తున్నారు. అలా రోజువారీగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి మార్కులు వేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పాఠాలను చెప్పవద్దని ప్రభుత్వం చెబుతుందని అయితే విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను మరిచిపోకుండా ఉండడానికి సామాజిక మాద్యామాల ద్వారా హోంవర్క్‌ చేయిస్తున్నానని నర్సయ్య వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించడంతో ఇప్పటి వరకు విద్యార్థులు పాఠాలను జ్ఞాపకం ఉంచుకున్నారని నర్సయ్య వివరించారు. తమ చిన్నారుల చదువుపై ఉపాధ్యాయుడు నర్సయ్య చూపిన శ్రద్ధ ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

విద్యార్థులు పాఠాలను మరిచిపోవడం లేదు 
ఏప్రిల్‌ నుంచి రోజు హోంవర్క్‌ను వాట్సాప్‌లో సంబంధిత స్కూల్‌ ఉపాధ్యాయుడు పోస్టు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మేము మా చిన్నారులతో హోంవర్క్‌ను రాయి స్తున్నా. దీంతో పాఠాలను ఎవరూ మరచిపోకుండా ఉన్నారు. ఉపాధ్యాయుల చొరవ మరువలేనిది. – గజ్జెల భాస్కర్, ఎస్‌ఎంసీ చైర్మన్‌ 

విద్యార్థులకు మేలు జరిగింది 
లాక్‌డౌన్‌ వల్ల బడులు ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయుడు నర్సయ్య తీసుకున్న చొరవతో విద్యార్థులకు మేలు జరిగింది. ఉపాధ్యాయుడు నర్సయ్యకు కృతజ్ఞతలు. – భోగ లతాశ్రీ, ఎస్‌ఎంసీ వైస్‌ చైర్మన్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు