‘విద్యానిధి’.. స్పందన హతవిధి!

21 Dec, 2016 01:58 IST|Sakshi
‘విద్యానిధి’.. స్పందన హతవిధి!

- రూ.20 లక్షల సాయమిస్తామన్నా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు
- నాలుగేళ్లుగా అర్హత సాధించింది 396 మందే
- పథకంపై ప్రచారం చేయని సంక్షేమ శాఖలు  


సాక్షి, హైదరాబాద్‌: ‘విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం రూ.20 లక్షలు. ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకేముంది ఈ పథకాన్ని బోలెడు మంది సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నారా..? అదేం లేదు.’ఇంతటి బృహత్తర అవకాశం ఉన్నప్పటికీ... అందిపుచ్చుకునే అభ్యర్థులు మాత్రం కరువయ్యారు. ఎస్సీ, ఎస్టీలలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో ఏటా ఆరు వందల మందికి ఈ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి కనీసం 30 శాతం దరఖాస్తులు మించడం లేదు. వీటిలో అర్హత సాధించేది పదిహేను శాతం లోపే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం దుస్థితి ఇది.

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తంతో విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఆపై విద్య అభ్యసించవచ్చు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ ఆర్థిక సాయం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రెట్టింపు చేసింది. బ్యాచ్‌లర్‌ డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించి, రూ.రెండు లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం ఉంటే చాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. శాఖాపరమైన మౌఖిక పరీక్షలో నెగ్గి, యునైటెడ్‌ స్టేట్స్‌ (యూఎస్‌), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ సీటు సాధించి ప్రయాణ ఖర్చులు భరిస్తే చాలు... పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. సులభతరమైన నిబంధనలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం గమనార్హం.

లక్ష్య సాధనలో అధ్వానం...
అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం లక్ష్యాల సాధన గత నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. నాలుగేళ్ల కాలంలో ఎస్సీ అభివృద్ధి శాఖకు 1,200 యూనిట్లకు గాను కేవలం 331 మందికి రూ.66.20 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కేవలం 65 మందికి రూ. 13 కోట్లు సహాయాన్ని విద్యార్థుల ఖాతాలో జమచేశారు. లక్ష్యాల మేరకు నిధులున్నప్పటికీ... అర్హులు లేకపోవడంతో మిగులు మొత్తాన్ని ఆ శాఖ అధికారులు వెనక్కు పంపించేస్తున్నారు. తాజాగా వెనుకబడిన తరగతుల వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2016–17 వార్షికంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 3వందల మందికి ఆర్థిక సాయం అందించే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు గతవారం వరకు ఆ శాఖ ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. కానీ క్షేత్రస్థాయి నుంచి 230 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ఇంటర్వూ్యలు నిర్వహించగా... అర్హుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు