దరఖాస్తులేవీ? 

13 Sep, 2018 03:25 IST|Sakshi

     నత్తనడకన ‘ఉపకార’దరఖాస్తు నమోదు 

     గడువు సమీపిస్తున్నా స్పందించని విద్యార్థులు 

     అంచనా 12.5 లక్షలు.. ఇప్పటికి 4.66 లక్షలే నమోదు 

     ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 30తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ముగుస్తుంది. జూలై రెండో వారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినా కనీసం మూడో వంతు విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం అధికారవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే దరఖాస్తులు స్వీకరించి 3 నెలల్లోపు పరిశీలన చేపట్టి విద్యాసంవత్సరం మధ్యలోనే ఉపకారవేతనాలు పంపిణీ చేయాలని సంక్షేమాధికారులు అనుకున్నా.. తాజా పరిస్థితి వారిని అయోమయానికి గురిచేస్తోంది. 2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ అధికారులు అంచనా వేశారు. పరిశీలన త్వరగా పూర్తి చేసేందుకు జూలై 10 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టగా బుధవారం నాటికి 4.66 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4.61 లక్షల మంది రెన్యువల్‌ విద్యార్థులుండగా.. 5 వేల మంది ఫ్రెషర్స్‌ ఉన్నారు. మొత్తంగా రెన్యువల్‌ కేటగిరీలో 45 శాతం దరఖాస్తులు సమర్పించారు. ఫ్రెషర్స్‌ కేటగిరీలో 2 శాతం కూడా మించలేదు. గడువు సమీపించినా ఆశించిన స్థాయిలో విద్యార్థులు స్పందించకపోవడంతో గడువు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. 

ముందస్తు ఉపకారం లేనట్లే 
ఉపకారవేతన దరఖాస్తులు సకాలంలో వస్తే వేగంగా పరిశీలించి విద్యా సంవత్సరం మధ్యలో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనం అందించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా జూలై రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. కానీ 2 నెలలైనా మూడో వంతు దరఖాస్తులు కూడా రాలేదు. పోస్టుమెట్రిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగిసినా నమోదు ఆశాజనకంగా లేకపోవడంతో గడువు పెంపు అనివార్యం కానుంది. నెల రోజుల పాటు గడువు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గతేడాది దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తవలేదు. దరఖాస్తుల సమర్పణలో జాప్యం జరగడం, వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యం కావడంతో 2017–18 దరఖాస్తులు ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం వరకు తీసుకున్నారు. దీంతో పరిశీలన, స్కాలర్‌షిప్‌ల పంపిణీ ఆలస్యమైంది. ఈసారి దరఖాస్తుల స్వీకరణ ముందుగా నిర్వహించకుంటే గతేడాది పరిస్థితే పునరావృతం కానుందని ఓ అధికారి వాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు