గురుకులం.. సమస్యలతో సతమతం

20 Nov, 2014 23:23 IST|Sakshi

దౌల్తాబాద్ : మండలంలోని బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 25 ఏళ్ల క్రి తం ప్రారంభించిన ఈ గురుకులంలో తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు సుమారు 672 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. గురువారం సా క్షి  పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. కొన్న ఏళ్లుగా నీళ్ల చారు, చారును మరిపించే పప్పును వండుతున్నారని, ఉడికీ ఉడకని అన్నాన్ని రోజూ వడ్డిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిన, దెబ్బ తిన్న అరటిపండ్లు సరఫరా చేస్తూ అవి కూడా వారానికి ఎప్పుడో ఒకసారి అందిస్తున్నట్లు తెలిపారు.

 సాంబారు, పప్పుకు ఎక్కువగా కుళ్లిన కూరగాయలనే వాడుతూ వాటినే తమకు పెడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. బియ్యంలో చిన్న చిన్న రాళ్లతో పాటు చెత్తాచెదారం ఉండడంతో తినడానికి ఇబ్బదులు పడుతున్నట్లు వివరించారు. చివరకు పెరుగు అన్నం తిందామన్నా వాటిలో కూడా నీళ్ల శాతమే ఎక్కవగా ఉంటుందని తెలిపారు. అలాగే తమకు సరఫరా అయ్యే పాలల్లో అధిక శాతం ఉపాధ్యాయులకే సరఫరా అవుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. గురుకులంలో ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో చెట్లు, గుట్టలు పడతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్నానాల గదులు నీళ్లులేక నిరుపయోగంగా మారాయని, దీంతో ఆరుబయట నీళ్ల ట్యాంక్‌ల వద్ద స్నానాలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.  ఇదిలా ఉండగా.. ఇంటర్ విద్యార్థులకు తప్పని తిప్పలు : ఇక్కడ రెండేళ్ల క్రితం ఇంటర్ మీడియట్ తరగతులను ప్రారంభించారు. ఇందులో 86 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక వంటశాల లేకపోవడంతో పాఠశాల విద్యార్థులతో పాటే భోజనాలు చేయిస్తున్నారు. దీంతో పాఠశాల, ఇంటర్ విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు