ముదురుతున్న తె.యూ వివాదం

23 Nov, 2018 17:15 IST|Sakshi
తె.యూ మెయిన్‌ గేటు వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టిన విద్యార్థులు 

నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించిన విద్యార్థులు 

 కాంట్రాక్టు  అధ్యాపకులకు మద్దతుగా..

 సాక్షి, తె.యూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పాతిక రోజులుగా కొనసాగుతున్న అందోళనలు గురువారం విద్యార్థులు నిరవధిక దీక్షలు చేపట్టడంతో మరింత ముదిరాయి. యూనివర్సిటీలో బోధన తరగతులు కొనసాగక విద్యా సంవత్సరం వృథా అవుతోందని ఆరోపిస్తూ మూడు రోజులుగా అందోళనబాట పట్టిన విద్యార్థులు చివరికి ఆమరణ దీక్షలకు దిగారు. 

చిచ్చురేపిన జీవో నంబరు 11.. 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల(అకడమిక్‌ కన్సల్టెంట్లు)కు వేతనాలు పెంపు చేస్తూ జీవో నంబరు 11ను విడుదల చేసింది. అయితే తెయూ వీసీ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య తొమ్మిది కోర్సులను సెల్ఫ్‌ ఫైనాన్స్‌లుగా ప్రకటించారు. ఆయా కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నంబరు 11 ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. వర్సిటీలో అన్ని కోర్సులు రెగ్యులర్‌ కోర్సులుగానే పరిగణించాలని, జీవో నంబరు 11ను కాంట్రాక్టు అధ్యాపకులందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ 9 కోర్సుల కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె బాట పట్టారు. 25 రోజులుగా క్యాంపస్‌ మెయిన్‌ గేటు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని నిరవధిక రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో 9 కోర్సుల్లో పాఠాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడం లేదు. 


పట్టించుకోని వీసీ, రిజిస్ట్రార్‌లు.. 

25 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా వీసీ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బలరాములు మొండివైఖరితో సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చర్చల పేరుతో పిలిచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, 19 రోజులుగా వీసీ యూనివర్సిటీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్‌ సైతం తన చేతిలో ఏమీ లేదని వీసీ ఎలా చెబితే అలా చేస్తామని చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా మూడు రోజులుగా విద్యార్థులు నేరుగా అందోళనబాట పట్టారు. వీసీ సాంబయ్య కన్పించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి క్యాంపస్‌ ఆవరణలో అతికించారు. బోధన, బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. గురువారం సైతం బోధన, బోధనేతర సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న విద్యార్థులు అల్పాహారం సైతం గేటు వద్దకే తెప్పించుకుని తిన్నారు.  

ఆమరణ దీక్షలు.. 

వీసీ, రిజిస్ట్రార్‌ల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం విద్యార్థులు విఘ్నేశ్, వినోద్, అఖిల్, నర్సింలు, శ్రీకాంత్, అశోక్, ప్రశాంత్‌ ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరంలో విద్యార్థు లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు జరగకపోవడంతో సిలబస్‌ పూర్తి కాలేదని, ఈ నెల 27నుంచి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సిలబస్‌ పూర్తి కాకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థి నాయకులు యెండల ప్రదీప్, క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్‌ లు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు