ఫీజులు కట్టాలని క్లాస్‌లో నిలబెడుతుండ్రు 

13 Nov, 2019 08:58 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌ : ‘సమ్మె కారణంగా మా తల్లిదండ్రులకు జీతాలు రావటం లేదు.. మా స్కూళ్లల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.. క్లాస్‌లో అందరి ముందు నిలబెడుతుండ్రు.. మా జీవితాలు ఏమవుతాయోనని భయంగా ఉంది.. మీరే ప్రభుత్వం మీద పోరాటం తీవ్రతరం చేసి మా తల్లిదండ్రుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడండి ప్లీజ్‌..’ అంటూ ఆర్టీసీ కార్మికుల పిల్లలు మంగళవారం గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపో వద్ద సమ్మెకు మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు కార్మికుల పిల్లలు శ్రీవర్ధన్, సాత్విక్, ఆశ్విత్, రక్షిత్‌రెడ్డి తదితరులు లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. సమ్మె వల్ల మా అమ్మానాన్నలు కడుపు నిండా తినడంలేదు.. ఎప్పుడూ చూసినా సమ్మె గురించే ఆలోచిస్తుండ్రు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు తమ బాధను వ్యక్తం చేసిన తీరుపై లక్ష్మణ్‌ చలించిపోయారు. ‘ఎవరూ ఆందోళన చెందొద్దు.. పోరాడి సమస్యలు పరిష్కరించుకుందాం. కారి్మకులకు బీజేపీ అండగా ఉంటుంది’ అంటూ లక్ష్మణ్‌ భరోసానిచ్చారు.   

మరిన్ని వార్తలు