ఓయూలో ఆమరణ దీక్షలు

4 Sep, 2014 02:54 IST|Sakshi
ఓయూలో ఆమరణ దీక్షలు

క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం
 నిరసన ర్యాలీలు... ఉద్రిక్తత

 హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం...పోలీసుల జోక్యంతో బుధవారం క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టీపీపీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దీక్షలకు మద్దతుగా యూనివర్సిటీ లైబ్రరీని బహిష్కరించిన వందలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ప్రదర్శనతో ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ముళ్ల కంచెను, బారికేడ్లను అడ్డంగా పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీ.విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతారాయ్, చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతుల మినహా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు