కలల కొలువు దరి చేరేనా?

31 Jan, 2018 03:11 IST|Sakshi

ఉద్యోగ కల్పనకు బడ్జెట్‌లో ఏం చేస్తారో.. జైట్లీ వైపు విద్యార్థులు, నిరుద్యోగుల చూపు

ఈయన పేరు అశోక్‌ యాదవ్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పీహెచ్‌డీ విద్యార్థులకు కేంద్రం అందిస్తున్న జేఆర్‌ఎఫ్, ఐసీఎస్‌ఆర్‌ ఫెలోషిప్‌ ఫండ్‌ పరిశోధన అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేస్తే కానీ పేద విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేసే అవకాశం లేదని వాపోతున్నారు. కేంద్రం అందించే జేఆర్‌ఎఫ్‌ ఫండ్‌ను రూ.32 వేల నుంచి రూ.50 వేలకు, ఐసీఎస్‌ఆర్‌ ఫండ్‌ను రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంచితేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. పీహెచ్‌డీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఎంతో అవసరమని, ప్రభుత్వం వాటిని ఉచితంగా సరఫరా చేస్తే విద్యార్థులపై భారం తగ్గుతుందంటున్నారు. నెట్, సెట్‌లను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల లెక్చరర్‌ పోస్టుల నియామకాల కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదురు చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. 

ఇది ఒక్క అశోక్‌ బాధ మాత్రమే కాదు.. సగటు నిరుద్యోగులు, విద్యార్థుల సమస్య కూడా! పాఠశాల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల్ని భర్తీ చేయకపోవడంతో యువతకు నాణ్యమైన విద్య అందడం లేదు. చదువులు పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు లభిస్తాయన్న స్థైర్యం యువతలో కొరవడింది. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తే సమస్యకు పరిష్కారం లభించనుంది. అలాగే యూపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలకు అనుసరించే క్యాలెండర్‌ విధానంలో సమూల మార్పులు జరిపి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన విషయంలో ఆచరణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలంటున్నారు. 

మరిన్ని వార్తలు