ఎలక్ట్రికల్‌ మాస్క్‌

5 Jun, 2020 12:03 IST|Sakshi

నాగోలు:  కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిందే.. కరోనా నుంచి కాపాడుకునేందుకు కొంత మంది విద్యార్థులు, యువకులు కలిసి కొత్త పద్ధతిలో తక్కువ ఖర్చుతో కోవిడ్‌–19 ఎలక్ట్రికల్‌ మాస్క్‌ తయారు చేశారు. ఈ మాస్క్‌ గాలి ద్వారా వచ్చే  అంటువ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఇది చెమట, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని నిర్వాహకులు తెలిపారు.  నాగోలు జైపురికాలనీ ప్రాంతానికి చెందిన శివ(బీకామ్‌), ప్రభాకర్‌(ఇంటర్‌), రామకృష్ణా(క్యాబ్‌ డ్రైవర్‌), రమేష్‌ (ఐటీఐ ఎలక్ట్రికల్‌), దుర్గా(బీఎస్సీ), శీరిషా(పాలిటెక్నిక్‌) కలిసి బ్లూ వింగ్స్‌ టీం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మహిళల భద్రత కోసం సన్ట్‌గన్‌ పవర్‌ బ్యాంక్‌ తయరు చేశారు. అందరూ కలిసి నూతన ఆలోచనతో  మాస్క్‌లను తయారు చేశారు.

కోవిడ్‌–19 ఎలక్ట్రికల్‌ మాస్క్‌
వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు శ్యాస సమస్యలు, గాలి ద్వారా వచ్చే అంటు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుకునేందుకు ఈ మాస్క్‌ ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్‌ రాకుండా కాపాడుతుందని బ్లూ వింగ్స్‌ టీం సభ్యులు తెలిపారు. దీన్ని వాష్‌ చేసి మళ్లీ వాడొచ్చని అన్నారు. చిన్న పిల్లలు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు ఈ మాస్కులను వాడొచ్చని తెలిపారు. డీసీ మోటారు, కాటన్‌ క్లాత్, రీఛార్జ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ పైపు, ప్యాకెట్‌ నిబ్యులైజర్‌ ఉపయోగించి మాస్క్‌లను తయారు చేశారు. ఇందులో మనకు కావాల్సిన జిందా తిలిస్మాత్, జండుబాం, ఏదైనా ఫ్లేవర్‌ను ఉపయోగిస్తే తక్షణమే ఉపశమనం కలుగుతుందని వివరించారు. 

మరిన్ని వార్తలు