డిగ్రీలోనూ ‘ఇంగ్లిష్‌’ హవా!

8 May, 2018 01:37 IST|Sakshi

  ఇంగ్లిష్‌ మీడియం కోర్సుల్లో చేరేందుకే విద్యార్థుల ఆసక్తి

  ఏటేటా పడిపోతున్న తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: 
- హయత్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్‌ గ్రూపులో 60 సీట్లు ఉంటే గతేడాది అందులో 10 మందే చేరారు. 
- ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీలోని తెలుగు మీడియం బీజెడ్‌సీలో 60 సీట్లు ఉంటే 29 సీట్లే భర్తీ అయ్యాయి. 
- కోరుట్ల డిగ్రీ కాలేజీ తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్‌ గ్రూపులో 50 సీట్లు ఉంటే గతేడాది ఒక్కరూ చేరలేదు. 
- మణుగూరు డిగ్రీ కాలేజీలో బీకాం తెలుగు మీడియంలో 60 సీట్లు ఉంటే గతేడాది 10 మందే చేరారు. 

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఆయా కాలేజీల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడమే. ఇదే సమయంలో అక్కడి ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేటు కాలేజీల్లో మాత్రం విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని కళాశాల విద్యా శాఖ నిర్ణయించింది. తెలుగు మీడియంలో విద్యార్థులు పెద్దగా చేరని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సగం తెలుగు మీడియం, సగం ఇంగ్లిష్‌ మీడియం కోర్సులను నిర్వహించేలా రంగం సిద్ధం చేసింది. 

ఇప్పటి వరకూ ప్రైవేటే దిక్కు: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుకోవాలంటే 90 శాతం మందికి తెలుగు మీడియమే దిక్కు. గత విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్, బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు కొన్ని కాలేజీలు మినహా ఎక్కువ శాతం తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇకపై ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుల స్వరూపం మారబోతోంది. ఉపాధి అవకాశాల్లో ఇంగ్లిష్‌ మీడియం వారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇంగ్లిష్‌ మీడియం కోర్సులను కళాశాల విద్యా శాఖ ప్రవేశ పెడుతోంది. 

మారనున్న కోర్సుల స్వరూపం.. 
ఇందులో భాగంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(బీఏ)లో హిస్టరీ, ఎకనామిక్స్‌తో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ రాబోతోంది. ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌తోనూ కంప్యూటర్స్‌ చేయవచ్చు. బీఎస్సీలో జువాలజీ, కెమిస్ట్రీతోపాటు బయో కెమిస్ట్రీ చదువుకోవచ్చు. మైక్రో బయాలజీ చేయవచ్చు. కోర్సుల్లో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లను పెంచాలని నిర్ణయించింది. గతేడాది కంటే 17 వేలకుపైగా సీట్లను అదనంగా 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతం 59,875 ఇంగ్లిష్‌ మీడియం సీట్లు ఉండగా, వాటిని 77,280కి పెంచనుంది. మరోవైపు పదిలోపు సీట్లు మాత్రమే భర్తీ అయిన తెలుగు మీడియం కోర్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. 

కోర్సులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు  
డిగ్రీ కోర్సుల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో సిలబస్‌లోనూ మార్పులు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు గెస్ట్‌ లెక్చరర్లను నియమించి బోధన కొనసాగిస్తాం.    
– నవీన్‌ మిట్టల్, కళాశాల విద్యా కమిషనర్‌

నేడు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ప్రవేశాలను చేపడుతున్నామని, నోటిఫికేషన్‌ 10న ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని, 14వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. నల్లకుంటలోని ఏకేఎల్‌ఆర్‌ ఓరియంటల్‌ కాలేజీని లింగ్విస్టిక్‌ కాలేజీగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కాలేజీలో బీఏ హిందీ, బీఏ అరబిక్‌ తదితర భాషా కోర్సులనూ ప్రవేశపెడుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు