‘అడ్వాన్స్‌డ్‌’గా  ఉంటేనే...అదిరే ర్యాంకు

8 Oct, 2019 04:15 IST|Sakshi

జేఈఈ మెయిన్‌లో ర్యాంకు కోసం అడ్వాన్స్‌డ్‌ తరహాలో సిద్ధమవ్వాల్సిందే..

ర్యాంకును తారుమారు చేయనున్న న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు

ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనే న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు

ఈసారి జేఈఈ మెయిన్‌లో ‘న్యూమరికల్‌ వ్యాల్యూ’కు 60 మార్కులు

ప్రిపరయ్యే వారికి ఈ మూడు నెలలే కీలకమంటున్న ఐఐటీ నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తరహాలో సిద్ధమైతేనే జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చని ఐఐటీ నిఫుణులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల విధానమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్న జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలే విద్యార్థులకు ర్యాంకుల ఖరారులో కీలకం కానున్నాయి.

దీంతో జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ విధానాన్ని మార్చుకుంటేనే పక్కాగా ర్యాంకును సాధించొచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు. ఇప్ప టివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే న్యూమరికల్‌ వ్యాల్యూ పరీక్షల విధానముండగా, ఇప్పుడు జేఈఈ మెయిన్‌లోనూ తేవడంతో విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ తరహాలోనే మెయిన్‌కు ప్రిపేర్‌ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

న్యూమరికల్‌ప్రశ్నలకే 60 మార్కులు.. 
జేఈఈ మెయిన్‌లో గతంలో 360 మార్కులకు పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ ఇప్పుడు వాటిని 300 మార్కులకు తగ్గించింది. ప్రశ్నల సంఖ్య కూడా 90 నుంచి 75కు కుదించింది. అయితే పరీక్షల్లో అడిగే ప్రశ్నల విధానాన్ని కూడా మార్పు చేయడంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ విధానాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యం గా జేఈఈ మెయిన్‌ టార్గెట్‌ చేసుకొని సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది తప్పనిసరి అని ఐఐటీ నిఫుణుడు ఉమాశంకర్‌ సూచిస్తున్నారు.

ఇక నుంచి నిర్వహించే జేఈఈ మెయిన్‌ ప్రశ్నల్లో 15 ప్రశ్నలు (ఫిజిక్స్‌లో 5, కెమిస్ట్రీలో 5, మ్యాథ్స్‌లో 5 చొప్పున) న్యూమరికల్‌ వ్యాల్యూ (సంఖ్యాత్మక సమాధానం వచ్చేవి) సమాధానంగా వచ్చే ప్రశ్నలను ఇవ్వనుంది. అయితే ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు ఇవ్వలేదు. కేవలం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే ఈ ప్రశ్నలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు వాటిని ఎలాగూ నేర్చుకుంటారు కాబట్టి జేఈఈ మెయిన్‌కు ప్రిపరయ్యే విద్యార్థులు న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏటా తెలంగాణ నుంచి 75 వేల వరకు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు జేఈఈ మెయిన్‌ రాస్తున్నారు. వారిలో మెయిన్‌ ద్వారా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో దాదాపు 10 వేల మందికి పైగా చేరుతున్నారు.

ర్యాంకులపై ప్రభావం.. 
మొత్తంగా 75 ప్రశ్నలు కాగా ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులకు జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రం ఉంటుంది. అందులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇచ్చే 25 ప్రశ్నల్లో 5 ప్రశ్నల చొప్పున 15 ప్రశ్నలు న్యూమరికల్‌ వ్యాల్యూ సమాధానంగా వచ్చేవి ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 60 మార్కులు వాటికే. కాబట్టి ర్యాంకుల ఖరారులో అవే కీలకం కానున్నాయి.

కాబట్టి విద్యార్థులు న్యూమరికల్‌ వ్యాల్యూ సమాధానంగా వచ్చే ప్రశ్నలకు నిర్లక్ష్యం చేయొద్దని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ర్యాంకులు తారుమారు అవుతాయని చెబుతున్నారు. పైగా ఈ 15 ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు లేవు కాబట్టి బాగా రాస్తే మంచి స్కోర్‌ చేసే అవకాశం ఉంటుందని ఉమాశంకర్‌ తెలిపారు. అదే మిగతా 60 ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇచ్చే ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కుల విధానం ఉంటుంది. అందులో ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే ఒక మార్కు కోత పడుతుంది.

అందుకే నెగిటివ్‌ మార్కులు లేని న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో స్కోర్‌ చేసేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు. వచ్చే జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్యలో, ఏప్రిల్‌ 3 నుంచి 9వ తేదీ మధ్యలో నిర్వహించే మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలని సూచిస్తున్నారు. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే వారికి ఈ మూడు నెలల సమయం కీలకమైందని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు