సిటీ విద్యార్థుల చూపు.. డీమ్డ్‌ వర్సిటీల వైపు! 

23 Jul, 2020 08:44 IST|Sakshi

ఎంట్రెన్స్‌ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించలేకే.. 

తమిళనాడు, కర్నాటకల్లోని డీమ్డ్‌ వర్సిటీలకు పరుగు 

డీమ్డ్‌ వర్సిటీలు, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దరఖాస్తుల వెల్లువ 

ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా, మెనేజ్‌మెంట్‌ కోర్సులపై ఆసక్తి 

ఎంట్రెన్స్‌ పరీక్షలను రద్దు చేసిన పలు డీమ్డ్‌ వర్సిటీలు  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన కలకలంతో ఎంట్రెన్స్‌ పరీక్షల కోసం ఎదురు చూడకుండా పలువురు నగర విద్యార్థులు ప్రైవేట్‌ వర్సిటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అత్యుత్తమ బోధన, ల్యాబ్‌ సదుపాయాలు, ప్రాక్టికల్‌గా ఆయా సబ్జెక్టులను బోధించే ప్రైవేట్‌ వర్సిటీలు, డీమ్డ్‌ వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా, మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల విషయంలో మెజార్టీ విద్యార్థులు ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నట్లు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. అక్కడ విద్యాబోధన అనంతరం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకునే అవకాశాలుండటంతో ఆయా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇక ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు సైతం కోవిడ్‌ కారణంగా ఎంట్రెన్స్‌ పరీక్షలను రద్దు చేయడంతో ఆయా విద్యాసంస్థలకు నగర విద్యాసంస్థల నుంచి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుండటం విశేషం. 

ప్రైవేటు వర్సిటీలకు భారీగా దరఖాస్తులు.. 
ప్రధానంగా మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేటు డీమ్డ్‌ వర్సిటీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ పొందేందుకు సిటీ విద్యార్థులు వేలాది మంది దరఖాస్తు చేస్తున్నారు.  ఇటీవల కోవిడ్‌ కారణంగా ఎంట్రెన్స్‌ పరీక్షను రద్దు చేయడంతో వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అడ్మిషన్‌ పొందేందుకు నిత్యం ఏపీ, తెలంగాణా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నుంచి సుమారు పదివేల దరఖాస్తులు తమకు అందుతున్నాయని వీఐటీ వైస్‌ ప్రెసిడెంట్‌ జీవీ సెల్వమ్‌ తెలిపారు. ఇందులో సింహభాగం హైదరాబాద్‌ నుంచే వస్తున్నాయంటున్నారు.  

ఏటా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు  2 లక్షలకు పైగా దరఖాస్తులు అందుతాయని తెలిపారు. అడ్మిషన్‌ ఇచ్చేందుకు.. ఇంటరీ్మడియెట్‌ లేదా ప్లస్‌టు మార్కులు, జేఈఈ లేదా స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్నారు. ఇక లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీకి సైతం ఈ ఏడాది 25 శాతం మేర దరఖాస్తులు పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులోనూ నగర విద్యార్థుల దరఖాస్తులే అధికమని సంస్థ అడిషనల్‌ డైరెక్టర్‌ అమన్‌ పేర్కొన్నారు. 

పరుగులు ఎందుకంటే.. 

  • కోవిడ్‌ పంజా విసరడంతో పలు ఎంట్రెన్స్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ,అడ్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యమౌతోందని నగరానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. 
  • సెపె్టంబర్, అక్టోబర్‌ వరకు నిరీక్షించేకంటే ప్రైవేటఫ్‌ విద్యా సంస్థలు, డీమ్డ్‌ వర్సిటీల్లో తమ పిల్లలను చేరి్పస్తేనే బాగుంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. 
  • కోవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన తమ పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న కారణంగా ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీల్లో సీటు సాధించేందుకు యతి్నస్తున్నట్లు మరికొందరు పేరెంట్స్‌ తెలిపారు. 
  • డీమ్డ్‌ వర్సిటీల్లో బోధన, ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభిస్తాయన్న నమ్మకం  కూడా ఆ దిశగా సిటీ విద్యార్థులు తరలి వెళ్లేలా చేస్తోంది.
మరిన్ని వార్తలు