ఉద్యమ సేవలకు గుర్తింపుగా..

25 Apr, 2015 01:19 IST|Sakshi

- పైలట్ శిక్షణకు రూ.30 లక్షలు..
- టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రకటించిన సీఎం కేసీఆర్
- ఆనందంలో విద్యార్థిని సంజన
కౌడిపల్లి:
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థినికి సీఎం కేసీఆర్ బాసటగా నిలిచారు. కౌడిపల్లికి చెందిన సంజన అలియాస్ స్వీటీ చిన్నవయస్సులోనే తన తల్లితో కలిసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఓవైపు టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు చదువుపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది. పెలైట్ శిక్షణ కోసం అధిక మొత్తంలో డబ్బు అవసరం ఉండగా ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి, సంజనకు రు.30 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

వివరాలు.. కౌడిపల్లికి చెందిన ఓం ప్రకాశ్, అనిత దంపతులు. ఓం ప్రకాశ్ ప్రస్తుతం కౌడిపల్లి మండలం దేవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అనిత టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా మహిళా కార్యదర్శిగా, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, బీఎస్‌ఎన్‌ఎల్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పాపన్నపేట మండలం కొడపాక నుంచి ఎంపీటీసీగా పోటీ చేశారు. వీరి మూడో కూతురు సంజన. ఈమె కూడా తల్లితో కలిసి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవంతోపాటు మెదక్ జిల్లా సింగూర్ నీటిని సాగు, తాగు అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ నిర్వహించిన సింగూర్ సింహగర్జనలో సంజన పాల్గొంది. మహబూబ్‌నగర్ జిల్లాలో మాల్పల్ నుంచి గద్వాల వరకు జరిగిన పాదయాత్రలో సైతం పాల్గొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కేసీఆర్ వెంట నడిచింది. దీంతో సంజన పైలట్ కావాలనే తన బలమైన కోరికను సీఎం దృష్టికి తీసుకెళ్లింది. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ శుక్రవారం జరిగిన ప్లీనరీలో రూ.30 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. తన కోరిక నెరవేరబోతుండడంతో సంజన ఆనందంలో మునిగింది.

>
మరిన్ని వార్తలు