హెల్మెట్‌ పెట్టుకుని పాఠాలు..

21 Aug, 2019 18:24 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టిన నిరసన కూడా ఇలాంటిదే. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సాగిస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉండగా.. అన్ని కూడా శిథిలావస్థకు చేరాయి. అలాగే ఆ పాఠశాలలో ఇతర కనీస వసతులు కూడా లేవు.  

ఈ పరిస్థితుల్లో స్లాబ్‌ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. తన తలపై హెల్మెట్‌ ధరించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆ టీచర్‌ నిరసన తెలుపుతున్న ఫొటో పరిస్థితి తీవ్రతను అద్ధం పట్టేలా ఉంది. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా