చదువుకు చలో అమెరికా

19 Nov, 2019 06:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అగ్రరాజ్యంలో ఉన్నతవిద్య కోసం భారత విద్యార్థుల బారులు

ఈ ఏడాది 2 లక్షల మంది పయనం

అమెరికన్‌ ఎంబసీ తాజా గణాంకాల్లో వెల్లడి

ఐదు రాష్ట్రాలవైపే ఎక్కువ మంది విద్యార్థుల మొగ్గు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన మనోళ్ల సంఖ్య

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా 2 లక్షలు దాటింది. ఈ ఏడాదిలో ఏకంగా 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా బాటపట్టారు. 2014లో లక్ష మార్కు దాటిన విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి మన విద్యార్థులు మరికాస్త ఎక్కువగా అమెరికా విశ్వవిద్యాలయాలకు క్యూ కట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఏడాది అమెరికా వెళ్లిన టాప్‌ 5 దేశాల్లో చైనా లేకపోవడం. ఆరేడు సంవత్సరాల క్రితం దాకా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో చైనాదే అగ్ర స్థానం. దాదాపు దశాబ్దంపాటు అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చైనా విద్యార్థుల హవా కొనసాగింది. మరోవైపు అమెరికా నుంచి భారత్‌ వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అత్యధికులు ఆ ఐదు రాష్ట్రాలకే... 
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జాబితాలో వరుసగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయీ రాష్ట్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకునేందుకు విద్యార్థులపై ఎక్కువ ఆర్థికభారం పడుతున్నప్పటికీ మంచి విశ్వవిద్యాలయాలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటంతో చాలా మంది ఆ రాష్ట్రాన్ని రెండో ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.

మరి హెచ్‌1బీ కోటా పెంచకపోతే... 
అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఏటా భారీగా అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి అక్కడ సాంకేతిక ఉపాధి అవకాశాలు తేలిగ్గా లభించడమే ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2014 నుంచి భారతీయ విద్యార్థులు భారీగా అగ్రరాజ్యానికి తరలివెళ్తున్నారు. అక్కడ గ్రాడ్యుయేషన్‌ చేసిన విద్యార్థులను మూడేళ్లపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)పై మూడేళ్లపాటు ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈలోగా హెచ్‌1బీ వీసా (వర్క్‌ వీసా) వస్తేనే ఆ దేశంలో పని చేయడానికి అనుమతిస్తారు. లేనిపక్షంలో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌1బీ వీసా కోటా (80 వేలు) పెంచకపోతే భవిష్యత్తులో భారతీయ విద్యార్థులకు కష్టాలే. ఎందుకంటే... ఉదాహరణకు 2016లో అమెరికా వెళ్లిన 1,65,919 మంది విద్యార్థులంతా ఓపీటీ అర్హత సాధించి అదే ఏడాది హెచ్‌1బీ వర్క్‌ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటే అప్పటికే ఓపీటీపై ఉండి వీసా రాని వారు సుమారు 80 వేల మంది ఉండి ఉంటారు.

ఈ లెక్కన ఒక్క భారత్‌కు చెందిన వారే సుమారు 2.46 లక్షల మంది హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటారు. మొత్తం 80 వేల హెచ్‌1బీ వీసాల కోటాలో భారతీయులకే 75 వేలు వచ్చాయనుకుంటే ఇంకా 1.70 లక్షల మంది మిగిలిపోతారు. తదుపరి ఏడాది వచ్చేవరకూ 2017లో వెళ్లిన 1,86,267 మంది విద్యార్థులంతా ఈ ఏడాది ఓపీటీ అర్హత సాధిస్తే 2020 ఏప్రిల్‌కు హెచ్‌1బీ వీసా దరఖాస్తుదారులు అవుతారు. అప్పుడు బ్యాక్‌లాగ్‌ 1.70 లక్షల మందితోపాటు తాజాగా ఓపీటీపైకి వచ్చిన 1,86,267 మందిని కలుపుకుంటే దాదాపు 3.5 లక్షల మంది అవుతారు. వారిలో 80 వేల మందికి హెచ్‌1బీ వీసాలు వచ్చాయనుకున్నా ఇంకా 2.7 లక్షల మంది మిగులుతారు. ఇలా ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతే 2023 నుంచి అమెరికాలో చదువుకోవడానికి ఎంత మంది వెళ్తున్నారో తిరిగి వచ్చేవారు కూడా దాదాపుగా అంతే ఉంటారని నిపుణులు అంటున్నారు.

ఐదు దేశాలకు భారతీయ విద్యార్థుల ప్రాధాన్యత
ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఈ ఏడాది ప్రధానంగా ఐదు దేశాలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 3,32,033 మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరగా ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జర్మనీ ఉన్నాయి.

మరిన్ని వార్తలు