పరీక్షలకు దూరం..!

2 Feb, 2018 14:23 IST|Sakshi
పరీక్ష కేంద్రానికి అనువుగా బేలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

దూరభారంతో డిగ్రీ సెమిస్టర్‌

పరీక్షలకు గైర్హాజరు

అర్ధంతరంగా ముగుస్తున్న ఉన్నత విద్య

బేలలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వినతి

బేల(ఆదిలాబాద్‌) : దూరభారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షగా మారింది. ఫలితంగా ఉన్నత విద్యను అర్ధంతరంగా ముగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మారుమూల సరిహద్దు మండలం బేల. ఉన్నత విద్య కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని బేలకు వచ్చి ఇక్కడి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక ప్రముఖుల చొరవతో 2014–15లో మండల కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. గతంలో ఇంటర్‌ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారు, రెగ్యులర్‌ విద్యార్థులు ఇక్కడే ప్రవేశాలు పొందుతున్నారు. ఇంగ్లిషు మీడియం అయినప్పటికీ సమీపంలో ఉండడంతో మరాఠీ, గిరిజన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. 220 మంది డిగ్రీ విద్య అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా.. ఇబ్బందులను అధిగమించి వస్తున్నారు. పరీక్షల కోసం జిల్లా ఆదిలాబాద్‌లోని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ప్రభుత్వం సెమిస్టర్‌ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఒక విద్యా సంవత్సరంలో కచ్చితంగా రెండు పరీక్షలు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజు పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి రావడానికి ఎంతో సమయం పడుతోంది. గ్రామాల నుంచి విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాలేక చదువును అర్ధంతరంగా మానేస్తున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారి సంఖ్య 120 ఉండగా.. 2016–17లో 100కు తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో 58 పడిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంఖ్య సైతం 100కు తగ్గింది.

నిర్మల్‌ జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలకు అనుమతి..
మారుమూల మండల కేంద్రాల్లో ప్రైవేటు డిగ్రీ కళశాలలు ఉన్న చోట కాకతీయ యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలకు స్థానికంగా అనుమతి ఇస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్మల్‌ జిల్లాలోని కల్లూర్‌లోని ప్రైవేటు డిగ్రీ కళశాలకు సమీప ప్రభుత్వ జెడ్పీఎస్‌ఎస్‌లో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. లక్ష్మణచాందలోని కళశాలకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళశాలలో పరీక్ష కేంద్రం అనుమతి లభించింది. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి యూనివర్సిటీ అధికారులు బేలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, పోషకులు కోరుతున్నారు.

ఫస్ట్‌ సెమిస్టర్‌ రాయలేకపోయిన. మాది కూలీ కుటుంబం. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఉన్నదని, ఇష్టపడి చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి ఇక్కడి రావాలంటే ఎటువంటి వాహనాలు ఉండవు. చదువుకోవాలని ఆసక్తితో రెండు కిలోమీటర్లు కాలినడకన వస్తున్నాను. ఆదిలాబాద్‌కు వెళ్లి ఫస్ట్‌ సెమిస్టర్‌ రాయలేకపోయినా. ఇప్పుడు నా చదువు అర్ధంతరమేనో.– కైరి అశ్విని, బీఎస్సీ(బీజెడ్‌సీ) మొదటి సంవత్సరం, మోహబత్‌పూర్‌

నాన్నతో కలిసి పరీక్షలకు..  ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయడానికి ప్రతి రోజు నాన్నతో కలిసి వెళ్లాను. నా స్నేహితులు వారి కుటుంబ సభ్యుల తోడు లేకపోవడంతో ఈ పరీక్షలు రాయడానికి రాలేదు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– మరప అశ్విని, బీకాం మొదటి సంవత్సరం, బెల్లూరిగూడ

పరీక్ష కేంద్రం కోసం ప్రయత్నిస్తున్నాం
పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కళశాలకు సమీపంలో మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం.  భాష, రవాణా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం సెమిస్టర్‌ విధానంతో రెండు సార్లు పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లలేక విద్యార్థులు చదువు అర్ధంతరంగా మానేయడం బాధగా ఉంది. స్థానికంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– వరప్రసాద్‌రావు, కీర్తన డిగ్రీ కళశాల బేల

మరిన్ని వార్తలు