ఒక బడి.. కలబడి.. నిలబడి!

22 Aug, 2017 03:20 IST|Sakshi
ఒక బడి.. కలబడి.. నిలబడి!

ప్రభుత్వ స్కూలు మూసివేతపై విద్యార్థుల పోరాటం సక్సెస్‌
పెద్దపల్లి రూరల్‌:  ఆ ఊర్లో బడి ఉంది.. తగిన సంఖ్యలో విద్యార్థుల్లేరంటూ సర్కారు దాన్ని మూసేసింది.. టీచర్లను వేరే స్కూళ్లకు బదిలీ చేసేసింది.. కానీ పిల్లలు మాత్రం రోజూ బడికి వచ్చారు.. తమ బడిని తిరిగి తెరవాలంటూ పోరాటం మొదలుపెట్టారు.. గ్రామస్తులు కూడా తలా కొంత పోగేసి శ్రమదానంతో బడిని కట్టుకుంటే ఇప్పుడు మూసేయడమేమి టంటూ ఆందోళన చేపట్టారు.. స్థానిక ప్రజా ప్రతినిధులు వారికి మద్దతుగా నిలిచారు.. దీంతో సర్కారు దిగి వచ్చింది.. ఆ ఊర్లో బడి మళ్లీ తెరుచుకుంది. పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణ పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కథ ఇది.

నెల రోజులుగా..
ఉన్నతాధికారులు హేతుబద్ధీకరణ పేరుతో నెల కింద బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మూసివేశారు. టీచర్లను సమీపం లోని ఇతర స్కూళ్లకు బదిలీ చేశారు. ఇక్కడి విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తమ పాఠశాలను మూసేయవద్దంటూ విద్యా ర్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పోరాటం మొదలుపెట్టారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జడ్జి పట్టాభి రామారావు, డీఈవో, స్థానిక తహసీల్దార్‌ రెండు రోజుల కింద పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులం తా పాఠశాల వద్దకు చేరుకుని జిల్లా విద్యాధి కారిని నిలదీశారు. వెంటనే పాఠశాలను తెర వాలని డిమాండ్‌ చేయడంతో డీఈవో అంగీకరించారు. సోమవారం ప్రధానోపాధ్యా యుడు సురేందర్‌తోపాటు డిప్యుటేషన్‌పై వెంకటేశ్‌ అనే టీచర్‌ని పాఠశాలకు పంపారు. విద్యార్థులకు పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజనం అందించారు.

శ్రమదానంతో కట్టుకున్నాం
‘‘ఊర్లో వాళ్లమంతా కలసి నాగలికి రూ.200 చొప్పున పోగేసి.. శ్రమదానంతో బడిని కట్టుకున్నం.. చదువు చెప్పేందుకు సార్లకు కూడా మేమే తలా కొంత పోగుచేసి జీతాలి చ్చినం.. ఇప్పుడు పాఠశాలను తరలిస్తామంటే ఎట్ల ఊరుకుంటం’’అంటూ గ్రామస్తులు పేర్కొన్నారు. ఇక్కడి పాఠ«శాలలో 28 మంది విద్యార్థులే ఉన్నారంటూ విద్యాశాఖాధికారులు సాకు చూపారని.. ఇంగ్లిష్‌ మీడియం బోధనకు అనుమతిస్తే విద్యార్థుల సంఖ్య 100 దాటేద న్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బందులు రాకుండా చూస్తామంటూ ప్రభుత్వం ప్రకట నలు చేస్తోందని.. అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ పాఠశాలలో పనిచేసే టీచర్లను సమీపం లోని స్కూళ్లకు బదిలీ చేశారని.. వారందరినీ తిరిగి బ్రాహ్మణపల్లి పాఠశాలకు రప్పించాలని ఇన్‌చార్జి సర్పంచ్‌ మేకల రాజయ్య, మాజీ సర్పంచ్‌ గాండ్ల మల్లేశం కోరారు.

చర్యలు చేపట్టాం
‘‘బ్రాహ్మణపల్లి పాఠశాలను మూసివేసినా.. విద్యార్థులు మాత్రం యథావిధిగా పాఠశాలకు వస్తున్నారు. గ్రామస్తులు కూడా పాఠశాలను ఇక్కడే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి ప్రధానోపాధ్యాయుడితో పాటు డిప్యుటేషన్‌పై ఓ ఉపాధ్యాయుడిని నియమించాం. విద్యార్థులకు బోధనతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నాం. వారి సూచనతోనే తదుపరి చర్యలుంటాయి.’’
– వెంకటేశ్వర్‌రావు, పెద్దపల్లి డీఈవో

మరిన్ని వార్తలు