బియ్యం లేవట..

23 Apr, 2018 11:23 IST|Sakshi
ఖమ్మం : జలగం నగర్‌లోని గురుకుల విద్యాలయంలో భోజనం చేస్తున్న విద్యార్థినులు(ఫైల్‌)

సమ్మర్‌ క్యాంపు విద్యార్థులకు భోజన కష్టాలు

తలలు పట్టుకుంటున్న గురుకుల అధికారులు

బియ్యం ఇవ్వలేమంటున్న పౌర సరఫరాల శాఖ

ప్రత్యేక కేటాయింపు కోసం ఎదురుచూపులు

ఖమ్మంరూరల్‌: ఆటలు, నృత్యాలు, హార్స్‌ రైడింగ్, స్పోకెన్‌ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సొసైటీలు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో వారిని మెరికల్లా మారుస్తూ.. సమాజంలో ఉన్నత స్థితికి చేరేలా నిష్ణాతులైన వారిచే ప్రత్యేక శ్రద్ధపెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భోజనం అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. బియ్యం కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ తలకు మించిన భారమవుతోంది.

శిబిరాల కోసం అవసరమయ్యే బియ్యం కోటా ఇవ్వలేమని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పడంతో గురుకుల సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. సొసైటీలు ప్రతి సంవత్సరం సమ్మర్‌ క్యాంపు(వేసవి శిబిరం)లో భాగంగా వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి.. క్రీడలు, డ్యాన్స్‌లు, హార్స్‌ రైడింగ్, స్పోకెన్‌ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం వంటి 27 అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తుండటంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయం కూడా గురుకుల సొసైటీలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని పౌరసరఫరాల శాఖను కోరగా.. తాము ఇవ్వలేమని చెప్పడంతో విద్యార్థులకు భోజనం ఎలా అందించాలని సొసైటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 

క్యాంపుల్లో 1,200 విద్యార్థులు
ఇదిలా ఉండగా.. జిల్లాలో 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నందున అక్కడ వేసవి శిబిరం నిర్వహించే అవకాశం ఉండదు. మిగిలిన 13 గురుకుల పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సొసైటీలు భావించినా.. బియ్యం కొరతతో ఏర్పాటు చేయలేకపోతున్నారు. మొత్తం 14 గురుకులాల్లో 5,089 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి శిబిరాల్లో భాగంగా ఎనిమిది చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నారు. 1,200 విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నారు. వీరికి వసతితోపాటు భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం 7.5 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం ఇవ్వాలని సొసైటీలు ప్రతిపాదనలు చేశాయి.

అయితే ప్రత్యేక బియ్యం కోటాపై ప్రభుత్వం కూడా ఎటువంటి సూచనలు చేయలేదని, కోటా విడుదల సాధ్యం కాదని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పింది. దీంతో సొసైటీలు సర్దుబాటు ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. గత విద్యా సంవత్సరం కేటాయించిన కోటాలో పాఠశాలలవారీగా మిగులు బియ్యం ఏమైనా ఉన్నాయా.. ఇంకా వేరేవిధంగా బియ్యా న్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అలా మిగిలి ఉన్న బియ్యాన్ని క్యాంపులోని పిల్లలకు సర్దుబాటు చేయాలా.. లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా.. అని ఆలోచిస్తున్నాయి. కాగా.. నెలరోజుల క్యాంపు నిర్వహణకు మొత్తం 7.5 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉన్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదించారు. అయితే బియ్యం పంపిణీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, లేదంటే ఆకలి కేకలు తప్పేట్లు లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.

మరిన్ని వార్తలు