ప్రగతిభవన్‌ ముట్టడిలో ఉద్రిక్తత

25 Apr, 2019 00:44 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలపై  సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి రాగా.. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. విద్యార్థులు లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 28 మంది విద్యార్థులను అరెస్టు చేసి గోషామహల్‌ తరలించారు.

ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి కోటా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవిలు మాట్లాడుతూ... ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, వారికి జరిగిన అన్యాయం గురించి ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, రీవాల్యుయేషన్‌ కల్పించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, బోర్డు అధికారులపై చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తునఉద్యమిస్తామని హెచ్చరించారు.  

>
మరిన్ని వార్తలు