జాబ్ మేకర్స్‌గా ఎదగండి: అబ్దుల్ కలాం

8 Oct, 2014 02:48 IST|Sakshi
జాబ్ మేకర్స్‌గా ఎదగండి: అబ్దుల్ కలాం

విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు
 హైదరాబాద్ : విద్యార్థులు జాబ్ సీకర్స్(పొందేవారు)గా కాకుండా జాబ్ మేకర్స్(సృష్టించేవారు)గా ఎదగాలని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం జేఎన్‌టీయూహెచ్‌లోని ఆడిటోరియంలో డెరైక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీలో భారతదేశం 39వ స్థానంలో ఉందని, సింగపూర్ లాంటి దేశాలు అమెరికాను దాటి అగ్రస్థానంలో నిలిచాయన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చని చెప్పారు.
 
 సాంకేతికంగా, విప్లవాత్మకంగా మార్పులు వస్తున్నాయని, ఈ తరుణంలో విద్యార్థులు తమ మేధోశక్తికి పదును పెట్టాలని సూచించారు. చదువులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకతకు, పరిశోధనలకు దోహదపడాలన్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో టెక్నాలజీ ఆవిష్కరణలను క్షణాల్లో తెలుసుకొని విద్యార్థులు తమ ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.  వైజ్ఞానిక రంగంలో మన దేశం పరిపూర్ణత్వాన్ని సాధించడానికి ప్రతి భారతీయుడు తనవంతు చేయూతనివ్వాలని ఆయన కోరారు. నానోటెక్నాలజీ, ఐసీటీ, డీఎన్‌ఏ వంటి అంశాల గురించి ఆయన విపులంగా వివరించారు.
 
 విద్యుత్‌కు అంతరాయం
 సదస్సులో అబ్దుల్ కలాం ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా ఆయన తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. విద్యార్థినీ విద్యార్థులు మాత్రం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు