‘గజ్వేల్‌’పై కలెక్టర్ల అధ్యయనం

23 Apr, 2018 01:07 IST|Sakshi
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ వద్ద మిషన్‌ భగీరథ పైలాన్‌ ఎదుట కలెక్టర్ల బృందం

సాక్షి, హైదరాబాద్‌/గజ్వేల్‌: ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జిల్లాల కలెక్టర్లు అరుదైన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నియోజకవర్గం గజ్వేల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు, అటవీ శాఖ చేపట్టిన అటవీ సహజ పునరుద్ధరణ (ఏఎన్‌ఆర్‌), కృత్రిమ పునరుద్ధరణ (ఏఆర్‌)పై క్షేత్ర స్థాయిలో అధ్యయనం మొదలుపెట్టారు. గజ్వేల్‌లో జరుగుతున్న హరితహారం, అభివృద్ధి పనులను పరిశీలించాలని సీఎం సూచించిన నేపథ్యంలో కలెక్టర్ల బృందం అధ్యయనం ప్రారంభించింది.

ఆదివారం ములుగు అటవీ శాఖ అతిథి గృహంలో సమావేశమైన 29 మంది కలెక్టర్లు..  రీసెర్చ్‌ నర్సరీని, హరితహారం కోసం సిద్ధం చేసిన మొక్కల నర్సరీని పరిశీలించారు. సంగాపూర్‌లో 105 హెక్టార్లలో, కోమటిబండలో 160 హెక్టార్లలో, మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌ ప్రాంతంలో 55 ఎకరాల్లో చేపట్టిన ఏఆర్‌ ప్లాంటేషన్‌ను చూశారు. సింగాయపల్లి–చౌదర్‌పల్లి, కోమటిబండ–గజ్వేల్‌ తదితర రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్‌పై అధ్యయనం చేసింది.

అనంతరం గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌ హబ్‌ను, పేదల కోసం నిర్మించిన 1,250 డబుల్‌ బెడ్రూం మోడల్‌ కాలనీని కలెక్టర్ల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసేందుకు కలెక్టర్ల బృందం పర్యటించిందని అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పీకే ఝా చెప్పారు. గజ్వేల్‌ తరహాలోనే అన్ని జిల్లాల్లో ఏఎన్‌ఆర్, ఏఆర్, ఎవెన్యూ, బ్లాక్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ జరిగే అవకాశముందన్నారు. కాగా, హరితహారం, అభివృద్ధి పనుల తీరుపై కలెక్టర్ల బృందం ప్రశంసల వర్షం కురిపించింది.

మరిన్ని వార్తలు