సంప్రదాయసాగుపై అ‘సెస్‌’మెంట్‌ 

31 Jul, 2019 02:02 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న పీవీ సతీష్‌. చిత్రంలో డా.సురేశ్‌రెడ్డి తదితరులు

జహీరాబాద్‌ మహిళారైతుల సేద్యంపై అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: ‘మెట్ట రైతులు అనాదిగా అనుసరిస్తున్న సమీకృత సంప్రదాయ వ్యవసాయకజ్ఞానం ప్రతికూల వాతావరణంలో సైతం పౌష్టికాహార, ఆదాయ భద్రతను అందిస్తుంది. రైతుల భావోద్వేగాలు, ఆచారాలు, సంస్కృతితో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది. వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి, కరువొచ్చినప్పుడు ఏ యే భూముల్లో ఏ యే పంటలు కలిపి వేసుకోవాలన్న సంప్రదాయ విజ్ఞానం జీవవైవిధ్య సంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం’అని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) తదితర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది.  సెస్, డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డి.డి.ఎస్‌.), న్యూఫీల్డ్‌ ఫౌండేషన్‌(యు.ఎస్‌.) ఆధ్వర్యంలో గత ఏడాది ఖరీఫ్, రబీల్లో జహీరాబాద్‌ ప్రాంత రైతుల సాగు, జీవన స్థితిగతులపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ పరిశోధనా సంచాలకులు ఆర్‌.ఉమారెడ్డి, సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బి.సురేశ్‌రెడ్డి, డీడీఎస్‌ కమ్యూనిటీ మీడియా ట్రస్టు అధిపతి చిన్న నరసమ్మ, డీడీఎస్‌ కమ్యూనికేషన్స్‌ కోఆర్డినేటర్‌ దంతలూరి తేజస్వి, డీడీఎస్‌ డైరెక్టర్‌ పి.వి.సతీష్‌ అధ్యయనం చేశారు.  వివరాలను వారు మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. 

ఎన్నో విషయాలు తెలుసుకున్నాం... 
జహీరాబాద్‌ ప్రాంతంలోని 11 గ్రామాల్లో 20–30 మంది రైతులను 2017 జూన్‌ నుంచి 2018 మే వరకు అనేక దఫాలుగా కలుసుకొని, వారి సాగువిధానాన్ని సునిశితంగా పరిశీలించామని సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేశ్‌రెడ్డి తెలిపారు. తాము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకోని విషయాలెన్నో ఆ రైతుల వద్ద నుంచి తెలుసుకున్నామన్నారు. ‘విత్తనాన్ని బుట్టల్లో బూడిద, వేపాకు, ఎర్రమట్టి కలిపి దాచుకుంటారు. దిగుబడి ఎన్ని బస్తాలు? అనేది ఒక్కటే కాదు, పశువులకు మేత, భూమికి బలిమినిచ్చేవి ఏ పంటలు అని వాళ్లు చూసుకుంటారు. వాళ్ల పొలాల్లో సాగు చేయకుండా పెరిగే మొక్కలు పోషక, ఔషధ విలువలున్న అద్భుతమైన ఆకుకూరలు, వాళ్ల భూములు కూడా జవజీవాలతో ఉన్నాయి. వీళ్ల వ్యవసాయం జూదప్రాయం కాదు. అప్పులు, ఆత్మహత్యలుండవు. వ్యవసాయ సంక్షోభం నివారణకు ఇది అనుసరణీయం’ అని సురేశ్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు