భాషల బాషా

11 Apr, 2019 04:23 IST|Sakshi

‘బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ అంటాడు ‘బాషా’ సినిమాలో రజనీకాంత్‌ వేలెత్తి చూపుతూ. దేశంలోని ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ..ఎన్ని ఏకార్థ పదాలున్నాయో కొండలు, కోనలు ఎక్కిదిగి మరీ చెబుతున్నాడు గణేశ్‌ నారాయణ్‌ దేవ్‌. అందుకే ఆయన భాషల బాషా!

మనదేశంలో ఎన్ని భాషలున్నాయి? 780. ఇది మల్టిపుల్‌ చాయిస్‌లో ఒక ఆప్షన్‌ కాదు. నూటికి నూరు శాతం కచ్చితమైన ఆన్సర్‌. మరో ప్రశ్న.. మనదేశంలో ఉన్న భాషల్లో లిపి ఉన్న భాషలెన్ని? 86. ఇక్కడ కూడా రెండో ఆప్షన్‌ లేదు. నికార్సయిన జవాబిది. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నలోంచే ఇప్పుడు మనం ఆసక్తికరమైన అనేక విశేషాల్లోకి వెళ్లబోతున్నాం. 

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? 
ఇదేం ప్రశ్న. ఎన్నో భాషలెందుకుంటాయి? అని ఎదురు ప్రశ్నించారంటే ‘మంచు’లో కూరుకుపోయినట్లే. అక్కడ పదహారు రకాల భాషలు మనుగడలో ఉన్నాయి. మంచుకొండల పాదాల చెంత విస్తరించిన దేశంలో మంచును వర్ణించడానికే 200 పదాలున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా సరే... ఇది నిజం. ‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’  దేశవ్యాప్తంగా సంచరించి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయిన విషయాలివి.

మనుగడ పోరాటం
పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ‘లింగ్విస్ట్‌ గణేశ్‌ నారాయణ దేవ్‌’ ఆధ్వర్యంలో ఈ ‘ఏకార్థ పదాల సర్వే’ జరిగింది. రాజస్థాన్‌లోని సంచార తెగల్లో ఎడారి ఇసుకను వర్ణించడానికి ఎన్ని పదాలు వాడతారో లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదు. ఆ తెగల వాళ్లు అనేక ప్రాంతాల్లో సంచరిస్తుంటారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉన్న పదాలన్నింటితోనూ అనుబంధం కలిగి ఉంటారు. ఇలా మనదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో మాండలికాలు... వేటికవి తమ ఉనికిని కాపాడుకుంటూ ఉంటాయి. అయితే గడచిన యాభై ఏళ్లలో మనదేశంలో దాదాపుగా 250 భాషలు అంతరించి పోయాయి.  

అంతకు ముందెప్పుడో..!
మనదేశంలో భాషల మీద అధ్యయనం, భాషల పరిరక్షణ బ్రిటిష్‌ హయాంలో జరిగింది. ముప్పై ఏళ్ల పరిశోధనలో వాళ్లు గుర్తించింది 364 భాషలు, మాండలికాలను మాత్రమే. బ్రిటిష్‌ పాలకులు నియమించిన విదేశీ ఉద్యోగులు మారుమూల ప్రదేశాలకు వెళ్లక పోవడం, వాళ్లకు భారతీయ భాషల్లోని వైవిధ్యత స్పష్టంగా తెలియకపోవడంతో ఆ పరిశోధన పరిమితమైన నివేదికను మాత్రమే ఇవ్వగలిగింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో మన పాలకులు భాషాపరమైన పరిశోధన మీద ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పటికీ అధికారిక లెక్కల్లో బ్రిటిష్‌ అధికారుల నివేదిక ప్రామాణికంగా కొనసాగుతోంది. దానిని వ్యతిరేకిస్తారు గణేశ్‌. అందుకే ఆయన పరిశోధన మొదలు పెట్టారు.

పదేళ్లవుతోంది
‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ 2010లో ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. రచయితలు, ప్రొఫెసర్‌లు, పరిశోధకులు, స్కూలు టీచర్లతోపాటు భాషల మీద ఆసక్తి కలిగిన వాళ్లు మొత్తం కలిసి 3500 మంది ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వీరికి సర్వే ఎలా నిర్వహించాలనే మార్గదర్శనం చేయడం కోసం దేవ్‌ దేశవ్యాప్తంగా పర్యటించి మూడు వందల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. 
గణేశ్‌ నారాయణ దేవ్‌ మహారాష్ట్రలో పుట్టారు, వాళ్లది గుజరాతీ కుటుంబం. ఇంట్లో గుజరాతీ మాట్లాడేవాళ్లు. స్కూల్లో మరాఠీ మాధ్యమంలో చదవాల్సి వచ్చింది. అది ఒక సంఘర్షణ, అసౌకర్యం. అలాగే టెన్త్‌ పూర్తిచేసి కాలేజ్‌లో అడుగుపెట్టినప్పుడు ఇంగ్లిష్‌ రూపంలో మరో అడ్డంకి ఎదురైంది.

ఆంగ్లంలో చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేక కాలేజ్‌ మానేసి గోవాకు వెళ్లి గనుల్లో రోజు వారీ కూలీగా పనికి కుదిరారు. ఖాళీ సమయంలో ఇంగ్లిష్‌ రచనలను విస్తృతంగా చదివారు. ఇంగ్లిష్‌ మీద ఇష్టం పెరిగిన తర్వాత తిరిగి కాలేజ్‌లో చేరారు. తర్వాత కొల్హాపూర్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డీ కూడా చేశారు దేవ్‌. బరోడాలోని మహారాజా షాయాజీ రావు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో భాషల మీద పరిశోధన మొదలు పెట్టారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో 92 పుస్తకాలు రాయడానికి సిద్ధమయ్యారాయన. 2013లో మొదలైన ఈ యజ్ఞంలో ఇప్పటికి 45 పుస్తకాలు పూర్తయ్యాయి. మిగిలినవి  2020 నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు జి.ఎన్‌ దేవ్‌.

మంజీర

మరిన్ని వార్తలు