అవాస్తవాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు

26 Jul, 2019 08:15 IST|Sakshi
మాట్లాడుతున్న ఎక్బాల్‌పాషా

గద్వాల అర్బన్‌ : పదే పదే అవాస్తవాలు చెబుతూ పాలకు లు ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని  పాలమూరు అధ్యాయన వేదిక జిల్లా కన్వీనర్‌ ఎక్బాల్‌పాషా ప్రశ్నించారు. పాలమూరు ప్రయోజనాలను మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గురువారం స్థానిక రామిరెడ్డి గ్రంథాలయంలో ప్రజా సంఘాలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ జలాల అనుసంధానంపై, ఎప్పటికీ పూర్తి కానీ పాలమూరు ప్రాజెక్టులపై పాలమూరు అధ్యాయన వేదిక స్పష్టతతో ఉందన్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రీడిజైనింగ్‌ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జూరాల ప్రాజెక్టుపై 300రోజులు నీళ్లు వాడుకునే సామర్థ్యం ఉన్న నిర్మాణాలను చేపట్టాలన్నారు. నదుల అనుసంధానం డెల్టా ప్రయోజనాలకోసం దిగువన కాకుండా నీరందక దుర్భిక్షత అనుభిస్తున్న ఎగువ ప్రాంతం నుంచి అనుసంధానం జరగాలని పాలమూరు అధ్యాయన వేదిక ప్రశ్నిస్తే నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మీ పార్టీకి ఉంటే పాలమూరు, నడిగడ్డ ప్రాంత ప్రజల పొలాల్లో నీళ్లు ఎందుకు పారడం లేదని ప్రశ్నించారు. అలాగే గట్టు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ రద్దు చేయాలని, రైతులకు భూములు తిరిగి ఇవ్వాలన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం 15.9 టీఎంసీల ఆర్డీఎస్‌ వాటాను పొందే చర్యలు చేపట్టి పొలాలకు నీరందించాలన్నారు. ప్రజా జీవితాలు, పంట పొలాల దయనీయ పరిస్థితులపై ప్రజల మధ్యనే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, టీపీఫ్‌ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్, సీఎల్‌సీ జిల్లా కార్యదర్శి సుభాన్, రైతాంగ సమితి జిల్లా కార్యదర్శి క్రిష్ణయ్య, గోపాల్‌రావు, నర్సింలు, రేణుక, నాగరాజు, క్రిష్ణ  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు