హంగులు.. ఆర్భాటాలు

23 Nov, 2018 10:32 IST|Sakshi

మారిన ప్రచార సరళి, ఓటింగ్‌ విధానం 

పోలింగ్‌లో బ్యాలెట్‌ నుంచి వీవీ ప్యాట్‌ వరకు... 

ప్రచారంలో రాజ్యమేలుతున్న ఫ్లెక్సీలు  

సాక్షి, కల్వకుర్తి టౌన్‌ : చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్‌ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అణుగుణంగా ఓటింగ్‌ విధానంలోనూ మార్పు సంతరించుకుంది. ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.

ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులు ఉపయోగించగా ఇటీవల కాలంలో ఈవీఎంలు వినియోగాన్ని ఎన్నికల సంఘం పెంచింది. ఈసారి ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా నూతనంగా వీవీ ప్యాట్‌(ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలను ఎన్నికల సంఘం తెలంగాణలో వినయోగిస్తోంది. 


1950లో ఎన్నికల సంఘం ఏర్పాటు
దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పపక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ద సంస్ధ భారత ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటుచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జాతీయ ఎన్నికల కమిషన్‌లో భాగమే.

రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియామవళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ అంతా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. ఈ మేరకు దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951వ సంవత్సరంలో జరగగా ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్‌ విధానం అమలులో ఉండేది.

ముద్రించిన బ్యాలెట్‌ పేపరుపై ఏ అభ్యర్ధిని ఎన్నుకుంటామో ఆ అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి బ్యాలెట్‌ బాక్స్‌లో వేసేవారు. ఆ తర్వాత నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావటంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో ఈవీఎంలతో పాటుగా వీవీ ప్యాట్లను 
వినియోగిస్తోంది.


రిగ్గింగ్‌కు చెల్లిన కాలం 
భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్ధుల పేర్లు, పార్టీ గుర్తుతో ముద్రించిన పేపర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి గుర్తు వద్ద స్టాంప్‌ చేసి ఆ బ్యాలెట్‌ పేపరును బ్యాలెట్‌ బాక్సులో వేసేవారు.

ఓటింగ్‌ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల(ఓట్ల)లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యేవి. 1999 ఎన్నికలలో బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు.


ఈవీఎంలు

2004 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్‌ కోసం బ్యాలెట్‌ బాక్స్‌ల స్ధానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లు అమలులోకి వచ్చాయి. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం అమలు సఫలం కావటంతో 2004 నుంచి అన్ని చోట్ల ఈవీఎం ఓటింగ్‌ విధానం అమలులోకి వచ్చింది. దీని వలన బ్యాలెట్‌ పత్రాల ముద్రణ వలన జరిగే కాగితం వాడకం అరికట్టినట్లయ్యంది. ఈవీఎంలను భారత్‌ లిమిటెడ్, ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే రెండు ప్రభుత్వరంగ సంస్ధలు తయారు చేశాయి. విద్యుత్‌ సరఫరా వ్యవస్ధ లేని చోట కూడా బ్యాటరీ సాయంతో పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. ఒక్కో ఈవీఎంలో 1400 లోపు మంది ఓటర్లు ఓట్లు వేయొచ్చు. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలను వాడతారు. లేనిపక్షంలో బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

వీవీ ప్యాట్‌లు 
రాష్ట్రంలో వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎంలతో పాటుగగా వీవీప్యాట్‌ యంత్రాలను ఉపయోగించునున్నారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్‌ జరుగుతోందని.. ఏ పార్టీకి ఓటు వేసిన అధికార పార్టీకే పడుతోందని కొన్ని రాజీకయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను వినయోగింలోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రం ద్వారా అభ్యర్థి ఎవరికి ఓటు వేశారో ఏడు సెకన్ల పాటు డిస్‌ప్లే కనిపిస్తుంది. 
 

మారుతున్న ప్రచార సరళి
ఎన్నికల్లో అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు, జెండాలు, కరపత్రాలు, వాహనాలకు మైక్‌సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్‌ కళాకారులకు చేతినిండా పని ఉండేది.

సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించి, వాటిని గోడలపై అచ్చువేయటం ద్వారా పెయింటింగ్‌ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయం భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దానికి లైటింగ్‌ ఏర్పాటు చేసేవారు. పార్టీ చెండాలు పట్టుకొని అభ్యర్ధుల వెంట పార్టీ కార్యకర్తలు తిరగేవారు. నేటి సాంకేతిక యుగంలో ఫ్లెక్సీలు రాకతో పెయింటింగ్, లైటింగ్‌ కళాకారులకు వారికి పనిలేకుండా పోయింది. 


డిజిటల్‌ ప్రచారం
ఇప్పుడంతా డిజిటల్‌ హవా నడుస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రచారానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌లను వేదికగా చేసుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మెసేజ్‌లు, వాట్సాప్, వాయిస్‌ కాల్స్‌ ద్వారా ఓటర్లకు ఫోన్‌ చేస్తున్నారు. వాల్‌ పెయింటింగ్‌ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి.

గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ఫ్లైవుడ్‌ వాడేవారు. దీనిపై అభ్యర్ధుల,నాయకుల బొమ్మలు వేసేవారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావటంతో ఎంత పెద్ద కటౌట్‌ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది.  

 

మరిన్ని వార్తలు