అర్ధరాత్రి సబ్ కలెక్టర్ హడలెత్తించారు

22 Jun, 2015 11:08 IST|Sakshi

ఇసుక అక్రమార్కులపై కొరడా
ఒక ట్రాక్టర్, రెండు బైకుల స్వాధీనం
సాయిపూర్‌లో  ఇసుక డంప్ సీజ్
రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి 2 ట్రాక్టర్లు తీసుకెళ్లిన  ఇసుకాసురులు


తాండూరు రూరల్: వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి తాండూరులో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేయడంతో ఇసుక అక్రమార్కులు హడలెత్తిపోయారు. రాత్రి 1.30 నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వచ్చి ఇసుక అక్రమకారుల భరతం పట్టారు. ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌తో పాటు అక్రమార్కులకు సంబంధించిన రెండు బైకులు, కొన్ని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 1:30 నిమిషాలకు వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి ఓ బైక్‌పై తాండూరు వచ్చారు. ఆమె వెంట ఇద్దరు వీఆర్‌ఓలు, ఓ ఆర్‌ఐ ఉన్నారు. ముందుగా బైక్‌పై వెళ్తూ పాత తాండూరులో తనిఖీలు చేశారు.

అనంతరం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా వద్ద సబ్ కలెక్టర్ బైకును పక్కకు నిలిపి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గమనించించారు. అక్కడే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా అక్రమార్కులు ఇసుక అలాగే తరలించారు. ఓ ఇసుక ట్రాక్టర్ తాండూరు వైపు వెళ్లింది. సబ్‌కలెక్టర్ వర్షిణి ఓ ఇసుక ట్రాక్టర్‌ను తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి యాలాల మండలం బెన్నూర్ కాగ్నా నది సమీపంలోకి వెళ్లారు. కాగ్నా నది నుంచి వస్తున్న రెండు ట్రాక్టర్లను గమనించారు. రెవెన్యూ సిబ్బందిని ఆ ట్రాక్టర్లను అప్పగించారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకె ళ్లాలని సూచించారు.

అనంతరం ఆమె కాగ్నా నది సమీపంలో ఇసుక తరలిస్తున్న స్థలాలను పరిశీలించించారు. అయితే వాహనాలను తరలిస్తున్న రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన అక్రమార్కులు తమ ట్రాక్టర్లను పట్టణానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ బైక్‌పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దాడి చేసిన వారిని తాము గుర్తిస్తామని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో ఆమె వారిని తీసుకొని పట్టణానికి వ చ్చారు. అక్రమార్కులు సాయిపూర్ ప్రాంతంలో ఇసుక డంప్ చేయడంతో అక్కడికి వెళ్లి దానిని సీజ్ చేశారు. అప్పటికే ఇసుకాసులు పరారయ్యారు.

ముందుగా పట్టుకున్న ట్రాక్టర్‌ను(ఏపీ 28 టీఆర్ 6647) సబ్ కలెక్టర్ తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అక్రమార్కులు అప్రమత్తమయ్యారు. కాగ్నా నది నుంచి ఇసుక ట్రాక్టర్లను వేరే మార్గంలో తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటల వరకు తాండూరు పరిసర ప్రాంతాల్లో సబ్‌కల్టెర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం తాము పట్టుకున్న ఇసుక ట్రాక్టర్, బైకుల విషయమై తాండూరు ఏఏస్పీ చందనదీప్తికి సబ్ కలెక్టర్ వర్షిణి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు.  

స్థానిక రెవెన్యూ, పోలీసులపై అసహనం!
శనివారం అర్ధరాత్రి తనిఖీలకు వచ్చిన సబ్‌కలెక్టర్ వర్షిణి స్థానిక రెవెన్యూ, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెట్రోలింగ్ పోలీసులు ఇసుకతరలిస్తున్న అక్రమార్కులను పట్టుకోవడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీల విషయమై సబ్ కలెక్టర్ స్థానిక తహసీల్దార్ గోవింద్‌రావుకు కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.  

అక్రమార్కుల బెంబేలు..
సబ్ కలెక్టర్ వర్షిణి తనిఖీలకు వచ్చారనే స మాచారంతో ఇసుక వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దీంతో వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లతో వచ్చిన వారు దారి మళ్లించి పరారయ్యారు. సబ్ కలెక్టర్ రావడంతోఅక్రమార్కులు బెంబేలెత్తారు. ఇదిలా ఉండగా, సబ్‌కలెక్టర్ కొందరు అక్రమార్కుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు