‘నవయుగ’ ముందు ఆందోళన

16 Nov, 2019 04:17 IST|Sakshi

బకాయిలు వెంటనే చెల్లించాలని సబ్‌ కాంట్రాక్టర్ల  డిమాండ్‌ 

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు పనుల్లో తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు సబ్‌కాంట్రాక్టర్లు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు వంద మంది వరకు కాంట్రాక్టర్లు ఉదయం గేటు ముందు బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సుమారు రూ.150 కోట్ల బిల్లులు బకాయి పడ్డారని, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వచ్చినా.. నవయుగ కంపెనీ వాటిని తమకు చెల్లించడం లేదని ఆరోపించారు. వ్యవహారాన్ని సెటిల్‌ చేస్తామంటూ చైర్మన్‌ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు గత కొంతకాలంగా తమను కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దుయ్యబ ట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చైర్మన్‌తో అపాయింట్‌మెంట్‌ ఉందని చెప్పడంతో తామంతా ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక చైర్మన్‌ లేడంటూ బయటకు పంపించారని ఆరోపించారు. తామంతా రోడ్డున పడ్డామని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల నుంచి బిల్లులు చెల్లించడం నిలిపివేశారని ఆరోపించారు.

మట్టి పనులు చేశాం..
తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌నని, పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేశానని రాము అనే బాధిత కాంట్రాక్టర్‌ చెప్పారు. ఇందుకుగానూ రూ. 1.80 కోట్లు తనకు రావాల్సివుందన్నారు. గత జనవరి నుంచి మొన్నటి ఆగస్టు వరకు బిల్లుల చెల్లింపు జరగలేదని, ఎన్నిసార్లు అడిగినా ఎండీని అడుగుతామం టూ చెబుతున్నారని ఆరోపించారు. బిల్లులు బకాయిపడటంతో తనలాగే 50 మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు.

సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నాం..
పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్‌ కోసం తాను నవయుగ నుంచి సబ్‌ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందని కిరణ్‌ అనే కాంట్రాక్టర్‌ తెలిపారు. రూ. 4.50 కోట్లు బకాయి పడ్డారని వెల్లడించారు. బకాయిలపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, చైర్మన్‌ను కలవడంలో తాత్సారం చేస్తున్నారని, అందుకే బాధితులమంతా ఇక్కడకు వచ్చామని తెలిపారు.

మరిన్ని వార్తలు