తంగళ్లపల్లి ఎస్సైపై వేటు

18 Oct, 2019 10:27 IST|Sakshi

సాక్షి ఎఫెక్ట్‌

సాక్షి, సిరిసిల్ల : తంగళపల్లి ఎస్సై వొల్లొజుల శేఖర్పై గురువారం వేటు పడింది. ఆయనను జిల్లా ఎస్పీ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో జరుగుతున్న ఇసుక మామూళ్లతోపాటు వాటాల పంపకంపై వచ్చిన ఆరోపణలతో పోలీసు నిఘా వర్గాలు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇసుక అక్రమ రవాణాతోపాటు మామూళ్ల వసూళ్లపై జిల్లాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.

సిరిసిల్ల మానేరు నుంచి ఇసుక తరలింపు వాహనాల నుంచి పైసల వసూల్‌ తీరును బహిర్గతం చేస్తూ ’దసరా హు‘సార్‌’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై నిఘా వర్గాలు సమగ్ర నివేదికను తయారు చేసేందుకు ఆరా తీస్తున్నట్లు మరో కథనం ఈ నెల 6న ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే తంగళ్లపల్లి ఎస్సైగా పని చేస్తున్న శేఖర్‌పై పోలీసు అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎస్సై శేఖర్‌ను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. బుధవారం నలుగురు సీఐలు ఒకేసారి బదిలీ కావడంతో అసలేం జరుగుతోంది. అన్న ఆందోళనలో ఉన్న పోలీస్‌ అధికారులకు మరో ఎస్సైని బదిలీ చేశారంటూ ఉత్తర్వులు అందడంతో అందరిలో అంతర్మథనం ప్రారంభమైంది. తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్లో పనిచేసిన దాదాపు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు ఇసుక అక్రమ రవాణా వివాదాలతోనే వేటును ఎదుర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. మానేరు వాగు నుంచి జరుగుతున్న ఇసుక దందాలో మామూళ్ల వాటాలు, కేసులు నమోదు జాప్యాన్ని ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో అధికారులు ఆ వైపుగా దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలకు వెళ్లినట్లు తెలుస్తోంది.  

>
మరిన్ని వార్తలు