మధ్యాహ్న భోజనానికి సబ్సిడీ పప్పు

13 Oct, 2018 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పప్పు నిల్వలను వదిలించుకునేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కంది, పెసర వంటి పప్పులను సబ్సిడీపై రాష్ట్రాలకు ఇవ్వా లని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం, సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) తదితర సంక్షేమ పథకాలకు పప్పులను అందజేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ శుక్రవారం లేఖ రాసింది.

మార్కెట్‌ ప్రకారం సాధారణ ధరను నిర్ధారించి కిలోకు రూ.15 చొప్పున సబ్సిడీపై ఇస్తామని వెల్లడించింది. మొత్తం 34.88 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పు నిల్వలను వదిలించుకోవా లని భావిస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ప్రతి ఏడాది ప్రభుత్వసంస్థల ద్వారా కేంద్రం పప్పుధాన్యాలను సేకరిస్తోంది. దిగుమతులు కూడా వస్తుండటంతో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థంగాక వాటిని రాష్ట్రాలకు అంటగట్టాలని నిర్ణయించింది. ఏ పథకానికి ఎంతెంత అవసరమో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.  

రాష్ట్రంలో పేరుకుపోయిన కందులు
మరోవైపు నిల్వ ఉన్న పప్పుధాన్యాలను వదిలించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. తన వద్ద ఉన్న కందుల నిల్వలను పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇస్తామని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై సీఎస్‌ ఇటీవల ప్రత్యేక భేటీ నిర్వ హించారు. ప్రతి ఏడాది రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ కందులను కొనుగోలు చేసి, మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. క్వింటాకు రూ.5,450 కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసింది.

మార్క్‌ఫెడ్‌ వద్ద 11.29 లక్షల క్వింటాళ్లు పేరుకుపోయాయి. వాటిని క్వింటాలుకు రూ.3,500 మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. అలాఅమ్మితే వందల కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతోంది. త్వరలో రానున్న ఈ ఖరీఫ్‌ కందులనూ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఎలాగైనా నిల్వ కందులను వదలించుకోవాలన్న ఆలోచనతో వాటిని పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కందిని పప్పు చేసి కిలోకు రూ.50 చొప్పున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. కిలో, 5, 10, 25 కిలోల బ్యాగుల్లో ప్యాక్‌ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

ప్రజాపంపిణీ వ్యవస్థలో పప్పు సరఫరా లేదు
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు బియ్యం తప్ప ఇతర ఆహార పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడంలేదు. గతంలో కందిపప్పును సరఫరా చేసి నిలిపివేశారు. దీంతో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలంటే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న పప్పులనే వదిలించుకునే పరిస్థితి లేనప్పుడు ఇక కేంద్రం నుంచి వచ్చే లక్షల టన్నులు ఏం చేయగలరనేది ప్రశ్న.  

మరిన్ని వార్తలు