అర్హులందరికీ సబ్సిడీ రుణాలు

21 Apr, 2018 13:00 IST|Sakshi
మాట్లాడుతున్న ముత్యాల పులిరాజు

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

ముత్యాల పులిరాజు

అశ్వారావుపేటరూరల్‌: జిల్లాలో అర్హులైన వారందరికీ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందని కార్పొరేషన్‌ ఈడీ ముత్యాల పులిరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2016–17 ఆర్థిక సంవత్సారంలో జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 771 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.9.4కోట్ల సబ్సిడీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో 635 యూనిట్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వీటిల్లో 619 యూనిట్లకు రూ.5.87కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఆరు మండలాల్లో రుణాల మేళా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరి నాటికి అన్ని మండలాల్లో పూర్తి చేస్తామన్నారు.

అదే విధంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 2,323 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.26.47కోట్లు బబ్సిడీని కేటాయించినట్లు తెలిపారు. దీనికి తోడు అదనంగా మరో మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన సబ్సిడీ రూ. 26.05కోట్లను ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రుణాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 95 రకాల యూనిట్లు ఉండగా.. లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకురేందుకు మరిన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా కుల సంఘాల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఈ 95 రకాల యూనిట్లలో అవసరంలేని వాటిని రద్దు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఓంటేరు దేవరాజ్, ఇతర సిబ్బంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు