నచ్చిన రంగంలోనే సక్సెస్: మహేష్‌బాబు

5 Jun, 2014 00:31 IST|Sakshi
నచ్చిన రంగంలోనే సక్సెస్: మహేష్‌బాబు

సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: ఎవరైనా తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకుంటే కెరీర్ పరంగా రాణించగలరని సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిప్రాయపడ్డారు. ఐడియా సెల్యూలర్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ‘స్టూడెంట్స్ అవార్డ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన విభిన్న అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి సినిమాలపై ఇష్టంతోనే పెరిగానని చెప్పారు. అదే విధంగా తన కుమారుడు గౌతమ్‌ని కూడా అతనికి ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇటీవల ఓ మీడియా నిర్వహించిన సర్వేలో ఆదరణ, వ్యాపార ఒప్పందాల పరంగా మహేష్‌బాబు అగ్రగామిగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించగా.. సినిమాల పరంగా హార్డ్‌వర్క్ చేయడమే తన పని అని, దానికి ప్రతిఫలంగా లభిస్తున్న అభిమానుల ఆదరణకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు.

ఇటీవల తన సినిమా పోస్టర్‌కు సంబంధించి తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు.

తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, అవి పూర్తి కాగానే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. తాజాగా నటిస్తున్న 3 చిత్రాల విశేషాలనూ వివరించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా