హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

3 Jul, 2015 00:15 IST|Sakshi

భువనగిరి : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి కోరారు. గురువారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చిలుకూరులో 3.30 గంటలకు హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ఈనెల 5వ తేదీన ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మొక్క లు నాటే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు.
 
 నేడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణంలో చల్లదనాన్ని పెంచడంతో పాటు సమాజంలో సమస్యగా మారిన కోతులను తిరిగి అడవులకు పంపవచ్చన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు  పూర్తయ్యాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, కంపెనీలు హరితహారంలో పాల్గొం టాయని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా వరుసగా మూడు సంవత్సరాల్లో  2. 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని నర్సరీల్లో మొక్కలు పంపకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 33 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం 17 రకాల 67 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

మరిన్ని వార్తలు