ఉపాధినిచ్చిన నృత్యం

6 Mar, 2018 09:31 IST|Sakshi

దంపతులిద్దరూ డ్యాన్సర్లే..

భర్త ప్రోత్సాహంతో ముందుకు

సినీ రంగంలో రాణిస్తున్న శనిగారపు ఝాన్సీ టోనీ

మంచిర్యాలక్రైం: చిన్నతనంలో డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు బంధువులు, స్నేహితులు చప్పట్లు కొట్టేవారు. ఆ చప్పట్లే ఆమెను నాట్యం వైపు నడిపించాయి. ఆ నాట్యమే ప్రస్తుతం జీవానోపాధిని కల్పిస్తోంది. మంచిర్యాలకు చెందిన శనిగారపు ఝాన్సీటోని నాట్య ప్రస్థానం ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ఈవెంట్‌ షోలో గోదావరిఖనికి చెందిన శనిగారపు వినయ్‌కాంత్‌(టోని)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం డ్యాన్సర్లం. మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం ఒక బాబు ఫిన్ని రుబేన్‌(లిరిక్స్‌)(4) ఉన్నాడు.

ఇద్దరం డ్యాన్స్‌ మాస్టర్లు కావడంతో...
ఇద్దరం డ్యాన్స్‌ మాస్టర్లం కావడంతో డ్యాన్స్‌నే వృత్తిగా మలుచుకుని గోదావరిఖని, మంచిర్యాలలో డ్యాన్స్‌ స్కూల్‌ను స్థాపించాం. ప్రైవేటు పాఠశాలలోనూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఈవెంట్స్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వివాహ అనంతరం మా ఇద్దరి కుటుంబాలు కలిశాయి. భర్త ప్రోత్సాహంతోనే నేను డ్యాన్స్‌ రంగంలో నిలదొక్కుకోగలిగాను. పలు చానెళ్లలో పాల్గొని నాకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను ఏర్పర్చుకున్నాను. 2016లో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్‌ ఈవెంట్స్‌ పోటీల్లో పొల్గొని ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదు అవార్డు అందుకున్నాను. ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా నిర్మిస్తున్న ‘తుపాకి రాముడు’ చిత్రంలో హీరోయిన్‌ చెల్లెలు పాత్రలో నటిస్తున్నాను. నేనూ మా ఆయన కలిసి ఇప్పటివరకు ప్రైవేటు కార్యక్రమాల్లో సుమారు 500కు పైగా ఈవెంట్స్‌ చేశాం. ప్రస్తుతం 30 మందికి ఫోక్‌ డ్యాన్స్, బ్రేక్‌ డ్యాన్స్, భరతనాట్యం, తదితర డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తున్నాం.  ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నాం. పేద కళాకారులను గుర్తిం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం.

మహిళలపై వివక్ష వీడాలి...
సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారు పురుషులకంటే ఎందులో తక్కువ లేరు. మహిళలకు అన్నిరంగాల్లో సమానత్వ హక్కులు కల్పించాలి.

మరిన్ని వార్తలు