సింగరేణి వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రద్దు

16 Mar, 2017 11:47 IST|Sakshi
సింగరేణి వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రద్దు

హైదరాబాద్‌ : సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. కాగా వారసత్వ ఉద్యోగాల నియామకాలను సవాల్‌ చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. 30వేల వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు రావంటూ అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదులో తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలగితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని  స్పష్టం చేసింది.  దీనిపై ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ... అన్ని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి బోర్డు పర్యవేక్షించాలని, అదేవిధంగా నూతన నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సూచించింది

కాగా రెండేళ్ల సర్వీసు కాలం మిగిలిన 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వారసులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల పథకాన్ని పునరుద్ధరించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది.