సుధీర్‌రెడ్డికే ఎల్‌బీనగర్‌ సీటు

18 Nov, 2018 07:37 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి:  ఎట్టకేలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగిసింది. శనివారం విడుదల చేసిన జాబితాలో ఎల్‌బీనగర్‌ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానాన్ని టీడీపీకి సర్దుబాటు చేస్తారని మొదట్నుంచి ప్రచారం సాగినా కాంగ్రెస్‌కే వదిలేస్తూ మహాకూటమి నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక క్రతువును పూర్తిచేశాయి. కాగా, తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ సీట్ల విషయంలో పునరాలోచన చేస్తుందనే ప్రచారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు స్థానే వేరే సీట్లను టీడీపీకి కేటాయించి.. వీటిని కాంగ్రెస్‌ తీసుకుంటుందనే వార్తలకు ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప ఫుల్‌స్టాప్‌ పడేలా లేదు.

ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఉన్న మల్‌రెడ్డి రంగారెడ్డి ఆశలు సజీవంగా ఉండడంతో ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే, ఈ సెగ్మెంట్‌ టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మెత్తబడ్డారు. శనివారం నాడు సామ రంగారెడ్డి నామినేషన్‌ కూడా దాఖలు చేయడంతో రంగం నుంచి తప్పుకునే సూచనలు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు కూడా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ను కలిసి సహకారం అందించాలని కోరారు. కాగా, క్యామ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్‌ వేయడం గమనార్హం. ఇక రాజేంద్రనగర్‌ విషయానికి వస్తే కాంగ్రెస్‌ అభ్యర్థిగా బండ్ల గణేశ్‌ పేరు తెరమీదకు వస్తుండడం.. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండంతో ఆసక్తికరంగా మారింది. టీడీపీ అభ్యర్థి గణేశ్‌గుప్తా ఒక సెట్‌ నామినేషన్‌ను సమర్పించారు.

మరిన్ని వార్తలు